ఓ మనిషిని ఇష్టపడడానికి మరీ గొప్ప రీజన్లే వుండక్కరలేదు.. కానీ అలా ఇష్టపడిన తరువాత అంతకన్నా గొప్ప గొప్ప కారణాలు అనేకం కనిపించవచ్చు. దాంతో అభిమానం అలా కొనసాగవచ్చు.
సినిమాలు అంటే ఇష్టమే కానీ ఫలానా సినిమా హీరో అంటే ప్రత్యేకించి అభిమానం వుండేది కాదు. అలాంటి టైమ్ లో కృష్ణ అంటే చాలా సిల్లీ రీజన్ తో అభిమానం ఏర్పడింది. నేను పెరిగింది విశాఖ జిల్లా కావడం తో అదంటే కొంచెం అభిమానం. అప్పట్లో విశాఖ లో పెద్దగా షూటింగ్ లు జరిగేవి కావు. విశాఖ మన్యం చాలా అందంగా వుండేది. కానీ ఎవ్వరూ అక్కడ సాహసించి షూటింగ్ లు చేసేవారు కాదు. మహా అయితే విశాఖ సిటీలో తప్పించి జిల్లా వైపు కన్నెత్తి చూసేవారు కాదు. పక్కన వున్న గోదావరి జిల్లాలో షూటింగ్ లు ఎక్కువ జరిగేవి.
అలాంటి టైమ్ లో అల్లూరి సీతారామరాజు సినిమాను దాదాపు విశాఖ మన్యంలో అన్ని సాధక బాధకాలు భరించి షూట్ చేసారు కృష్ణ. ఇదిగో ఇలాంటి చిన్న రీజన్ తో హీరోగా కన్నా వ్యక్తిగా కృష్ణ అంటే అభిమానం కలిగింది. అక్కడి నుంచి సినిమాలను చూస్తున్నట్లే కృష్ణ ను కూడా ప్రత్యేకంగా చూడడం మొదలైంది.
బాండ్ సినిమాలు…లవర్ బాయ్ పాత్రలు…ఫ్యామిలీ కథలు..పల్లెటూరి నేపథ్యాలు ఇలా ఒక్కో సినిమా ఒక్కో విధంగా అందించడం చూస్తుంటే కృష్ణ తీరు వేరు కదా అనిపించేది.
కురుక్షేత్రం సినిమా ను పోటా పోటీగా తీస్తున్నపుడు తీసుకున్న స్టార్ కాస్ట్, చేసిన ప్రయోగాలు, ఆ సినిమా విశేషాలు తెలుస్తుంటే మళ్లీ మరోసారి కృష్ణ అంటే పరిశీలన పెరిగింది. తను అనుకున్నది చేయడం కోసం అంతలా కష్టపడడం అంటే ఇష్టపడింది. దానవీరశూరకర్ణ కేవలం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో వల్ల ఆదరణ పొంది వుండొచ్చు. కానీ కురుక్షేత్రం సినిమా మేకింగ్ విషయంలో దానవీరశూరకర్ణ కన్నా ఓ మెట్టు పైనే వుంటుంది.
దేవదాసు సినిమాను మళ్లీ తీయడం అంటే అస్సలు ఊహించలేనిది. ఓ క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయిన సినిమాను టచ్ చేయాలనే ఊహే భయపెడుతుంది.అలాంటిది ఆ సినిమా చేయడం ఇంకా విశేషం. దేవదాస్ పాటలను మరిపించేలా కాకున్నా, అవి కూడా వినిపించేలా రమేష్ నాయుడు చేత పాటలు చేయించడం అంటే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అనిపించింది.
కృష్ణ వర్కింగ్ స్టయిల్ అనండి..ఆలోచనా విధానం అనండి..మొదటి నుంచీ ఇంతే అనిపిస్తుంది. సీతారామరాజు కు డ్యూయట్ నా? అని అంతా బుగ్గల మీద వేలు వేసుకున్న వేళ, అందరినీ మొప్పించేలా ‘వస్తాడు.నా రాజు’… పాటను చిత్రీకరించారు. సరే, సినిమా స్కోప్..70ఎంఎం ఇవన్నీ చాలా మందికి గుర్తుంది టెక్నాలజీ ఒడిసి పట్టుకోవడం అన్నది. కానీ కేవలం అది మాత్రమే కాదు.
తను నిర్మాతగా..హీరోగా సినిమా చేస్తూ ఎన్టీఆర్ ను కీలకపాత్రలోకి తీసుకోవడం…మల్టీ స్టారర్ లకు అప్పట్లోనే శ్రీకారం చుట్టిన దేవుడు చేసిన మనుషులు. దాని కన్నా ముందు తెలుగు తెరకు మెకనాస్ గోల్డ్ లాంటి సినిమాను పరిచయం చేసేలా మోసగాళ్లకు మోసగాడు.
ఇలా ఏం చేసినా ఓ విభిన్నత..వైవిధ్యం వుండేలా చేయడం కృష్ణ కు అలవాటు. తను ఏది అనుకుంటే దాని కోసం నిలబడిపోవడం… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తేడా వస్తే రాజ్ సీతారామ్ ను పరిచయం చేసి చాలా కాలం అలా నిలబెట్టడం, ఎన్టీఆర్ తో పొలిటికల్ గా తేడా వస్తే ధైర్యంగా విబేధించి సెటైరికల్ సినిమాలు చేయడం, తెలుగులో కాకలు తీరిన లబ్ద ప్రతిష్టులు ఎంతో మంది వున్నా కూడా బప్పీ లహరి ని తీసుకువచ్చి పరిచయం చేయడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కృష్ణ వ్యక్తిత్వానికి అద్దం పట్టే సంగతులు చాలా వున్నాయి.
విఎస్ఆర్ స్వామి…పుష్పాల గోపీకృష్ణ, మహారథి, పిసి రెడ్డి, వి రామచంద్రరావు, కేఎస్ఆర్ దాస్,రమేష్ నాయుడు ఇలా నిన్నటి తరానికి చెందిన చాలా అంటే చాలా పేర్లు గుర్తు వచ్చినపుడల్లా కృష్ణ గుర్తుకు వస్తారు. కృష్ణ తో ముడిపడి పదుల సంఖ్యలో టెక్నీషియన్లు టాలీవుడ్ చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.
రాజకీయాలకు విరామం ఇచ్చిన తరువాత మరి వాటి గురించి ఏనాడూ పెదవి విప్పింది లేదు. వియ్యపురాలు ఓ పార్టీ అయినా, అల్లుడు వేరే పార్టీ అయినా, సోదరుడు ఇంకో పార్టీ అయినా ఏనాడూ ఎక్కడా పొలిటికల్ కామెంట్ చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు.
సినిమా జనాలు అంతా జూబ్లీ హిల్స్..బంజారా హిల్స్ అంటుంటే, వాటికి దూరంగా నానక్ రామ్ గుడా లో ప్రశాంతమైన కుటీరం లాంటి ఇంట్లో, అది కూడా చెట్లు, పక్షులు, మట్టి వాసనల మధ్యన గడపడం చూసి, ఇది కదా కృష్ణ ఆరోగ్య రహస్యం అనిపించేది.
కృష్ణ ఎక్కడా ఫెయిల్ కాలేదు. విజయం ఆయనను వెన్నెంటే వుండేది. ఒక్క స్టూడియో అధినేతగా తప్ప మరెక్కడా ఆయన చేసిన పనులు విఫలం కాలేదు. ఏదో విధమైన పేరునే తెచ్చాయి. పద్మాలయా ఫిలింస్ కూడా సూపర్ హిట్టే. కానీ ఒక్క..పద్మాలయా స్టూడియోస్ ను మాత్రమే కృష్ణ నిలబెట్టలేకపోయారు. అదొక్కటే ఆయన ఫెయిల్యూర్. అది తప్ప అన్నీ కృష్ణ సాహసానికి, విజయాలకు ప్రతీకలే.
విఎస్ఎన్ మూర్తి