ఓవర్ ది టాప్… థియేటర్లకు ప్రత్యామ్నాయం కాగలదా? చిన్న సినిమాలు, ప్రస్తుత లాక్‌డౌన్‌లో ఒక మాదిరి బడ్జెట్ వున్న సినిమాల వరకు ఓటిటి రిలీజ్ ఓకే ఆప్షన్ కానీ… పెద్ద రేంజ్ సినిమాలకు ఎప్పటికీ ఇది లాభదాయకమయిన వేదిక కాలేదు. థియేటర్లలో వంద, నూట యాభై కోట్ల వసూళ్లు సాధించే సినిమాలకు ఓటిటి కంపెనీలు ఆ మొత్తం ఎలా చెల్లిస్తాయి? బాలీవుడ్ సినిమాలకు అయినా రీచ్ ఎక్కువ కనుక యాభై కోట్ల రేంజ్ వుండే సినిమాల వరకు ధైర్యం చేస్తున్నారు కానీ అక్కడా పెద్ద సినిమాల జోలికి పోవడం లేదు.
ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్ సినిమా ‘మాస్టర్’ ఓటిటిలో వస్తోందనే ప్రచారాన్ని నిర్మాతలు మరోసారి కొట్టి పారేసారు. థియేటర్లలో అనువైన పరిస్థితులు వున్నపుడే సినిమా విడుదలవుతుందని, ఓటిటిలో మాత్రం రాదని స్పష్టం చేసారు. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయిపోయింది కానీ థియేటర్ల లాక్‌డౌన్ వల్ల అలా నిలిచిపోయింది. నిర్మాతలకు వడ్డీ భారం పెరుగుతున్నా కానీ దసరా లేదా సంక్రాంతి వరకు వేచి చూడ్డానికే సిద్ధమని తేల్చి చెప్పారు.
అన్ని భాషల పెద్ద సినిమాలకూ నిర్మాతలు ఇదే నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లు ఓపెన్ అయితే అంత కాలం వినోదం లేని ప్రేక్షకులు సినిమాలకోసం ఎగబడతారని నమ్ముతున్నారు. అందుకే నష్టపోవడం ఇష్టం లేక కష్టమయినా ఎదురు చూసేందుకే సిద్ధపడిపోయారు.