బాలీవుడ్ బాద్‌షా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (77) కరోనా బారిన పడ్డారు. బిగ్‌బీతో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పిరేటరీ ఐసోలేషన్ యూనిట్‌లో చేరారు.
తండ్రీకొడుకులిద్దరూ తమతమ ట్విటర్ ఖాతాల ద్వారా కరోనా పాజిటివ్ విషయమై లోకానికి తెలియజేశారు. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమై అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమ 12వ సీజన్‌కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల తన ఇంట్లో కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రమోషన్ కార్యక్రమంలో అమితాబ్ పాల్గొన్నారు. అలాగే ఒకట్రెండు ఇతరత్రా ప్రాజెక్ట్‌ల్లో పాల్గొన్న అమితాబ్ కరోనా బారిన పడి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇక ఆయన చివరి సినిమా విషయానికి వస్తే ‘గులాబో సితాబో’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఆయన నటించిన చెహరే, బ్రహ్మాస్త్, ఝండ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అమితాబ్ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చారన్నారు. కరోనా పరీక్ష చేయించుకున్నారన్నారు. దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చిందని, అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. అయితే తాను కరోనా బారిన పడ్డట్టు స్వయంగా చెప్పేందుకు అమితాబ్ ముందుకు వచ్చారన్నారు. అందువల్లే తాము ప్రకటన చేసే బాధ్యత తీసుకోలేదన్నారు.
అయితే అమితాబ్ విషయంలో రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 77 సంవత్స రాలన్నారు. అలాగే ఆయన కాలేయ, ఉదర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటు న్నామన్నారు. మెరుగైన వైద్యంతో ఆయన త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావంతో చెప్పుకొచ్చారు.
కరోనా నిర్ధారణ అనంతరం అమితాబ్ ట్వీట్ చేస్తూ…తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బందికి వైద్యులు పరీక్షలు చేశారని తెలిపారు. ఆ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. గత పది రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
అలాగే అమితాబ్ కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ (44) ట్వీట్ చేశారు. తండ్రీతో పాటు తనకు స్వల్ప కరోనా లక్షణాలున్నా యని పేర్కొన్నారు. దీంతో తామిద్దరూ ఆస్పత్రిలో చేరినట్టు వెల్లడించారు. అయితే అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా నింపారు.
అమితాబ్ భార్య జయాబచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్‌లకు కరోనా నెగిటివ్ రావడం అభిమానులకు ఊరటనిచ్చే విషయం. కాగా అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ కరోనా బారిన పడడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది.తండ్రీకొడుకులు త్వరగా కోలుకోవాలంటూ పలువురు చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.