పాపం తుమ్మల.. చేరదీసేది ఎవరో?

తెలుగుదేశం పార్టీ వైభవం వర్ధిల్లిన రోజుల్లో మంత్రి పదవి సహా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నాయకుడు…

తెలుగుదేశం పార్టీ వైభవం వర్ధిల్లిన రోజుల్లో మంత్రి పదవి సహా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నాయకుడు 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భారాస తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. భారాస హవా రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడం గమనార్హం. కాగా, ఆ తరువాతి పరిణామాల్లో పాలేరు నుంచి కాంగ్రెసు తరఫున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి భారాసలో చేరారు.

అప్పటినుంచి తుమ్మల పార్టీ కార్యకలాపాలకు దూరంగా, అంటీముట్టనట్టుగా మెలగుతూ వచ్చారు. మధ్యమధ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటూ.. మళ్లీ పాలేరునుంచే పోటీచేస్తానని ఏ పార్టీ తరఫున అనేది ఇంకా నిర్ణయించుకోలేదని రకరకాల సంకేతాలు ఇచ్చారు. మధ్యలో భారాస కాస్త పూనుకుని ఆయనను బుజ్జగించింది. 

అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. సిటింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే మళ్లీ ఇచ్చారు. దీంతో తుమ్మల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయన అనుచరులు రహస్యంగా ఓ సమావేశం పెట్టుకుని రహస్య కార్యచరణ రూపొందించుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావును చేరదీయబోయేది ఎవరు? అనేదే ప్రశ్నార్థకంగా ఉంది.

ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెసు వైపు తుమ్మల మొగ్గడానికి అవకాశం ఉంది. అయితే షర్మిలను పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్.. ఆయనకు హామీ ఇవ్వగలుగుతుందో లేదో తెలియదు. ఎందుకంటే.. షర్మిల కాంగ్రెసులోకి వస్తే.. ఆమె కోరుతున్నట్టుగా పాలేరు సీటు ఇస్తారా? లేదా, పూర్తిగా ఏపీకే పరిమితం కావాల్సిందిగా నిర్దేశిస్తారా? అనేది క్లారిటీ లేదు.

కాంగ్రెసు వద్దని తుమ్మల అనుకుంటే.. ఆయనకు రెడ్ కార్పెట్ పరచి తమలో చేర్చుకోవడానికి తెలుగుదేశం, భాజపా రెండూ సిద్ధంగానే ఉంటాయి. కానీ.. ఆ ఇద్దరిలో తెలుగుదేశానికైనా నియోజకవర్గంలో నామ్ కే వాస్తే అన్నట్టుగా కొన్ని ఓట్లు ఉండవచ్చు గానీ.. భాజపాకు పార్టీ పరంగా సొంత ఓట్లు ఉంటాయనుకోవడం భ్రమ. 

అంటే ఆ రెండు పార్టీలను ఎంచుకుంటే తుమ్మల కేవలం తన సొంత బలం మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. అంత సాహసం చేస్తారా? లేదా, కాంగ్రెసులోకి షర్మిల ఎంట్రీ మరియు ఆమె సీటు కన్ఫర్మ్ అయ్యేవరకు వేచిచూస్తారా అనేది బోధపడడం లేదు.