మాజీ జేడీకి బేరాలేమీ కుదరలేదా?

నీతులు ప్రవచించడానికి ఆచరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని తన వ్యవహార సరళిలో కూడా నిరూపిస్తూ ఉండే వ్యక్తుల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఒకరు. ఆయన చాలా వేదికల మీద…

నీతులు ప్రవచించడానికి ఆచరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని తన వ్యవహార సరళిలో కూడా నిరూపిస్తూ ఉండే వ్యక్తుల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఒకరు. ఆయన చాలా వేదికల మీద నీతులు ప్రవచిస్తూ ఉంటారు. అయితే ఎన్నికల్లో ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకోలేకపోయారు. జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగినప్పటికీ.. గౌరవప్రదమైన స్థానం కూడా సంపాదించలేకపోయారు. 

రాజకీయాలను డబ్బులే శాసిస్తున్నాయని , ధనమయమైన రాజకీయాల గురించి ఆయన నిందలు వేయవచ్చు గాక.. అది నిజమే అనుకుంటే.. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నించాలి. వాటిని సంస్కరించడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతానని అంటున్నారు. 

సీబీఐ జెడి గా గతంలో పనిచేసిన ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కేసులను దర్యాప్తు చేసిన అధికారిగా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. రిటైరైన తర్వాత నీతిమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాననే తరహా మాటలు చెప్పారు. చివరికి పవన్ కల్యాణ్ గొడుగు కిందకు చేరి విశాఖపట్టణం నుంచి ఎంపీగా పోటచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కు దూరమై, సొంత పార్టీ ఆలోచన కూడా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు స్వతంత్రంగా పోటీచేస్తానని అంటున్నారు. 

ప్రజలు పార్టీలను చూసి కాకుండా, అభ్యర్థులను చూసి ఓటు వేయాలని లక్ష్మీనారాయణ పిలుపు ఇస్తున్నారు. పార్టీలలో టికెట్ తెచ్చుకోవడం కూడా ఇటీవలి కాలంలో చాలా కష్టంగా మారిపోయిందని, వారి వారి పద్ధతులు రకరకాలుగా ఉంటున్నాయని కూడా ఆయన సెలవిచ్చారు. చూడబోతే.. జనసేన నుంచి వెలుపలికి వచ్చి, సొంత పార్టీ ఆలోచన కూడా మానేసిన తర్వాత.. వివిధ పార్టీల ప్రాపకం కోసం ఆయన ప్రయత్నించి విఫలమైనట్టుగా కనిపిస్తోంది. 

ఓటు వేయడాన్ని కంపల్సరీ చేయాలి, ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలను ఆపేయించాలి అంటూ రకరకాల సుద్దులు చెబుతున్న ఈ మాజీ అధికారి.. ఈసారి స్వతంత్రంగా పోటీచేస్తానని , ఎక్కడినుంచి అనేది తర్వాత వెల్లడిస్తానని అంటున్నారు. అయితే తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కులబలం ప్రాతిపదికగా ఎంచుకుంటారా? ఆయన సేవలు నిజంగా అవసరం ఉండే నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అనే విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. 

ఎక్కడినుంచి పోటీచేసినా.. దాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను కూడా ఆయన చెప్పగలిగితే.. ఆయన చిత్తశుద్ధి గురించి ప్రజలకు కొంత స్పష్టత వస్తుంది.