ప్రధాని హోదాలో మోడీ నాలుగేళ్ళ తరువాత విశాఖ వచ్చారు. భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 10,742 కోట్లతో విలువైన పనులకు ప్రారంభోత్సవాలు అట్టహాసంగా చేసుకుని వెళ్లారు. లక్షలాది మంది జనాలతో వైసీపీ ప్రభుత్వం మోడీకి ఘనంగానే స్వాగతం పలికింది. అయితే రైల్వే జోన్ విషయం ఏమైంది అన్న డౌట్ ఉంది అందరికీ.
మోడీ ఢిల్లీ వెళ్ళాక కూడా విశాఖ బాగా గుర్తుండిపోయిందనిపించేలా రెండు రోజుల వ్యవధిలోనే విశాఖ రైల్వే జోన్ కి భారీ ఎత్తున నిధులు మంజూరు అయ్యాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం, భవనాల నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాల కోసం 106 కోట్ల రూపాయలను తాజాగా కేంద్రం విడుదల చేయడంతో విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యాభై ఏళ్ళ కలను మోడీ సర్కార్ తీర్చింది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంలో రైల్వే జోన్ వచ్చేసినట్లే అని ఇక గట్టిగా చెప్పేసుకోవచ్చు. వైసీపీ సర్కార్ కూడా ధీమాగా ఈ విషయం ప్రచారం చేసుకోవచ్చు. నిన్నటిదాకా మోడీ వచ్చి వెళ్ళినా రైల్వే జోన్ సంగతి ఏమైంది అంటూ టీడీపీ తమ్ముళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇపుడు వారి నోటికి తాళం పడేలా కేంద్రం జెట్ స్పీడ్ తో నిధులు విడుదల చేయడం అంటే అది వైసీపీ కి దక్కిన భారీ పొలిటికల్ మైలేజ్ గానే భావించాలి. విశాఖ రైల్వే జోన్ ని రెండు దశలుగా ఏర్పాటు చేస్తారు. తొలి దశలొ ఎనిమిది ఎకరాలలో బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తారు.
రెండవ దశలో మరో అయిదు ఎకరాలలో కీలక నిర్మాణాలతో పాటు పూర్తి పనులు చేపడతారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు 456 కోట్ల రూపాయలతో శ్రీకరం చుట్టిన కేంద్రం విశాఖ స్టేషన్ లో అదనంగా మరో రెండు ఫ్లాట్ ఫారాలను నిర్మిస్తోంది. ఈ పరిణామాలతో విశాఖకు రాజధాని హంగులు అన్నీ వచ్చినట్లే అంటున్నారు.