ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేకు సంబంధించిన ఆస్తుల జాబితా గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. వికాస్ దుబేను పోలీసులే పట్టుకున్నారంటే చాలా మంది నమ్మడం లేదు. ఎనిమిది మంది పోలీసులను చంపించి ఏడు వందల కిలోమీటర్ల దూరం మూడో కంటికి తెలియకుండా ప్రయాణించగలిగి, కరోనా పరిమితుల్లో కూడా రాష్ట్రం దాటగలిగిన అతడు తనంతకు తనే పట్టుబడి ఉంటాడనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఉజ్జయిని మహంకాళీ ఆలయం వద్ద తనే సమాచారం ఇచ్చాడని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడు దొరకడం, కొన్ని గంటల్లోనే పోలీసులు ఎన్కౌంటర్ చేసేయడం పై పలు అనుమానాలూ లేకపోలేదు.
అతడు బతికి ఉంటే.. ఎవరి గుట్టు బయటపడుతుందో అనే భయాలతోనే ఎన్కౌంటర్ జరిగిందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు వికాస్ దుబేకూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ కు ముడిపెడుతున్నారు. అదే నిజమైతే బీజేపీకి అంత కన్నా కావాల్సింది కూడా లేదు! ఆ విషయాన్ని నిరూపించేసి, అఖిలేష్ ను అరెస్టు చేసి ఉంటే.. సమాజ్ వాదీ గూండారాజ్ కు చెక్ పడేది కదా! అలా జరగలేదు.
ఆ సంగతలా ఉంటే.. వికాస్ దుబే ఆస్తుల చిట్టా భారీగా ఉందని వార్తలు వస్తున్నాయి. యూపీ పరిధిలో అతడికి 11 బంగళాలు, 16 ఫ్లాట్స్ ఉన్నాయని పోలీసుల విచారణలో ఇప్పటి వరకూ తేలిందట! ఇవన్నీ దుబే బినామీల పేర్లతో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే లక్నో లో 20 కోట్ల పై విలువ చేసే ఒక ఇంటిని కొనేందుకు బేరం కూడా ఆడాడట! ఇదీ వికాస్ దుబే రేంజ్. ఒక్కో ఇంటి విలువ ఆ స్థాయిలో ఉండవచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే.. యూపీ పరిధిలో స్థిరాస్తులుగానే వందల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టే.
గత మూడేళ్లలో వికాస్ దుబే మొత్తం 14 దేశాలను సందర్శించాడట! యూఏఈలో అతడికి ఒక ఇళ్లు ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇతర దేశాల్లో కూడా వికాస్ దుబే ప్రాపర్టీస్ కొని ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట పోలీసులు. దీంతో ఆ ఆస్తుల లెక్కలను తేల్చడానికి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగనుందని సమాచారం.