అవును. ఇది నిజమే. ఏదైనా చేయాలంటే తపన ఉండాలి. నిబధ్ధత కూడా ఉండాలి. ఆ విధంగా ఉండబట్టే నాడే విశాఖను రాజధానిగా వైఎస్సార్ చూడగలిగారు. అప్పట్లో విభజన ఉద్యమాలు ఇంకా ఒక రూపు దిద్దుకోలేదు. కానీ ఎంతో దూర ద్రుష్టి కలిగిన వైఎస్సార్ నాటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తో పాటుగానే విశాఖపట్నాన్ని కూడా రెండవ రాజధానిగా గుర్తించారు.
అందుకే ఫ్లై ఓవర్ని తొలిసారిగా వైజాగ్ సిటీకి మంజూరు చేశారు. అంతేకాదు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ తో పాటు విశాఖకు కూడా దక్కేందుకు క్రుషి చేశారు. అయితే విశాఖలో అది డీపీయార్ దశలో ఉండగానే వైఎస్సార్ కన్నుమూశారు.
ఇక టీడీపీ హయాంలో విశాఖ కేవలం సెమినార్లు, హడావిడికే పరిమితం అయింది. విశాఖలో మీటింగులు పెట్టి అమరావతి గొప్పలు చెప్పడానికే బాబుకు అయిదేళ్ల సమయం సరిపోయింది. దాంతో విశాఖ ప్రగతి గతి ఏమీ కాకుండా పోయింది. ఇపుడు వైఎస్సార్ తనయుడు జగన్ కూడా అచ్చంగా తండ్రిబాటలోనే నడుస్తున్నారు.
విశాఖ అభివ్రుధ్ధి మీద ప్రత్యేక శ్రధ్ధ చూపుతున్నారు. దాంతో మళ్లీ విశాఖ వికాసం మొదలైందని అంతా అంటున్నారు. విశాఖలో మెట్రో రైల్ కదలికలతో పాటు, నగరాన్ని సుందరీకరించడం వంటివి వైసీపీ సర్కార్ కార్యాచరణగా ఉంది.
రానున్న రోజుల్లో విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుతామని, విశాఖను ఆర్ధిక పాలనా రాజధానిగా చేస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెబుతున్నారు. విశాఖ అభివ్రుధ్ధి అంటే గుర్తుకువచ్చే పేర్లు రెండే. అవి వైఎస్సార్, జగన్ మాత్రమేనని మంత్రి అంటున్నారు.
భవిష్యత్తులో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారుతాయని పర్యాటకులకు స్వర్గధామమే అవుతుందని కూడా టూరిజం మంత్రి చెబుతున్నారు. మొత్తానికి అభివ్రుధ్ధికి దూరంగా విసిరేసినట్లుగా విశాఖకు మహర్దశ పట్టే రోజులు ముందున్నాయన్న ఆశ జనంలో బాగా కనిపిస్తోంది.