కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రవేశపెడితే.. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అదే కేంద్రం లాక్ డౌన్ ను సడలించి అన్ లాక్ తీసుకొస్తే.. దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన కొందరికి నవ్వు తెప్పిస్తే, 2 కుటుంబాల్ని విచారంలో ముంచింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన శ్రీకాంత్ ఫిబ్రవరిలో మనీషను పెళ్లి చేసుకున్నాడు. పట్టణ కేంద్రంలో వీళ్ల పెళ్లి అందరి సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత మనీషను పట్టణంలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచి, ఉద్యోగనిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు శ్రీకాంత్.
అయితే సరిగ్గా లాక్ డౌన్ కు ముందు మార్చిలో వనజ అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. యాదాద్రిలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. వనజతో హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. లాక్ డౌన్ పడే సమయానికి వనజను హైదరాబాద్ లో ఉంచి, సొంతింటికి వెళ్లి మనీషాతో కాపురం చేశాడు. అన్ లాక్ ప్రారంభమైన వెంటనే హైదరాబాద్ వచ్చి వనజతో కాపురం చేశాడు.
కొన్నాళ్లు ఇలా లాగిద్దామనుకున్న శ్రీకాంత్ ఒకే ఒక్క ఫోన్ కాల్ తో దొరికిపోయాడు. హైదరాబాద్ లో ఉన్న భర్తతో సరదాగా మాట్లాడేందుకు మనీషా ఫోన్ చేసింది. ఆ ఫోన్ ను వనజ ఎత్తడంతో శ్రీకాంత్ దొరికిపోయాడు. నువ్వు ఎవరంటే.. నువ్వు ఎవరంటూ ఇద్దరూ ప్రశ్నించుకున్నారు. నమ్మకం కుదరకపోవడంతో వాట్సాప్ లో పెళ్లి ఫొటోలు కూడా పంపించుకొని, ఒకరి ఫొటోలు మరొకరు చూసి అవాక్కయ్యారు.
తాను దారుణంగా మోసపోయానని మనీషా గ్రహించింది. వెంటనే హైదరాబాద్ వచ్చి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లయింట్ తీసుకున్న పోలీసులు శ్రీకాంత్ తో పాటు అతడి తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారు.
ఇంతకీ శ్రీకాంత్ భవిష్యత్తులో ఎవరితో కాపురం చేస్తాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వనజతో ఉంటాడా లేక పెద్దల సమక్షంలో పెళ్లాడిన మనీషాతో ఉంటాడా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరమ్మాయిలు ఇప్పుడు తమకు శ్రీకాంత్ వద్దంటున్నారు.