కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార్ తో భారతీయ జనతా పార్టీకి చీకటి ఒప్పందం ఉందా? ఈడీ కేసులను ఎదుర్కొంటూ కొన్నాళ్ల కిందటి వరకూ తీహార్ జైల్లో గడిపిన డీకేశి ఇప్పుడు దర్జాగా బయటే ఉన్నారు. కాంగ్రెస్ -జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వంలో డీకేశి కీలక పాత్ర పోషించారు. ఆ కూటమి అధికారం కోల్పోయే దశ నుంచి ఆయనకు కేసుల ఉచ్చు తగిలింది. ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన జైలుకు కూడా వెళ్లారు.
బీజేపీకి వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం రివాజుగా మారిన తరుణంలో డీకేశి పై కూడా అలాంటి చర్యలే అనే విమర్శలు వచ్చాయి. అయితే కమలనాథులు అలాంటి విమర్శలను లెక్క చేయలేదు. దాదాపు మూడు నెలలకు పైనే డీకేశిని తీహార్ జైల్లో ఉంచారు. మరి చివరకు ఆయనకు బెయిల్ దక్కింది. అప్పటి నుంచి ఆయనకు మళ్లీ కేంద్ర సంస్థల నుంచి ఇబ్బందులు పెద్దగా లేవు!
మరి ఇంతకీ ఇందులో అసలు కథేమిటి? అంటే.. డీకేశి భారతీయ జనతా పార్టీకి అభయం ఇచ్చాడనే టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చేసారి కూడా అక్కడ బీజేపీకి సొంతంగా అయితే మెజారిటీ రాదు! క్రితం టర్మ్ కన్నా తక్కువ సీట్లే వచ్చినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. బీజేపీకి ప్రత్యాహ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంటుందనే అంచనాలున్న రాష్ట్రాల్లో కర్ణాటక ముందు వరసలో ఉంది. మతవాదంతో మాత్రమే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ఆరాటపడుతూ ఉంది.
మరి రేపటి ఎన్నికల్లో హంగ్ తరహా పరిస్థితులు వచ్చినా, బీజేపీకి కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయినా.. డీకేశి వీలైనంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని అటు వైపు వెళ్తారనే టాక్ ఉంది. ఈ ఒప్పందం ఇప్పటికే కుదిరిందని, అందుకే డీకే శివకుమార్ కాంగ్రెస్ తరఫున రాజకీయం చేస్తూ ఉన్నా బీజేపీ పెద్దగా ఇబ్బంది పడటం లేదు!
బెయిల్, ఇతర ఏర్పాట్లు కూడా ఒప్పందంలో భాగంగా జరిగాయానే ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. ఎలాగూ బీజేపీకి పూర్తి మద్దతు రాదు. అప్పుడు ఎమ్మెల్యేలను చీల్చుకుని వచ్చే వాళ్లపైనే బీజేపీ ఆధారపడుతుంది. అలాంటి వాడిగా డీకేశి ని బీజేపీ చూసుకుందనే అభిప్రాయాలున్నాయి.
అందులోనూ కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిత్వాన్ని డీకేశి ఆశిస్తున్నారు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ లో బోలెడు గ్రూపులు! సిద్ధరామయ్య వర్గం డీకేశిని ఒప్పుకోకపోవచ్చు. అలా కాంగ్రెస్ లో ఈయన పొందని అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్సే ఈయనను సీఎంగా చేస్తానంటూ మాత్రం డీకేశి అక్కడే నిలిచే అవకాశాలున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ఈయనను సీఎంగా చేసినా.. ఎలాగూ ఈడీ కేసులు కేంద్రం చేతిలో ఉండనే ఉన్నాయి!