బాలీవుడ్ క‌ష్టాలు కొన‌సాగుతూనే ఉన్నాయ్!

కోవిడ్ ప‌రిస్థితుల త‌ర్వాత‌.. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించ‌డంలో సౌత్ సినిమాలు ఎంతో కొంత విజ‌యం సాధిస్తున్నాయి. కోవిడ్ ప‌రిణామాల మ‌ధ్య‌న దాదాపు రెండేళ్ల పాటు మెజారిటీ ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌తో ఎడం వ‌చ్చింది. వాస్త‌వానికి కోవిడ్…

కోవిడ్ ప‌రిస్థితుల త‌ర్వాత‌.. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించ‌డంలో సౌత్ సినిమాలు ఎంతో కొంత విజ‌యం సాధిస్తున్నాయి. కోవిడ్ ప‌రిణామాల మ‌ధ్య‌న దాదాపు రెండేళ్ల పాటు మెజారిటీ ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌తో ఎడం వ‌చ్చింది. వాస్త‌వానికి కోవిడ్ త‌ర్వాత ఇప్ప‌టికీ ఇంకా థియేట‌ర్లో అడుగుపెట్ట‌ని ప్రేక్ష‌కులు కూడా చాలా మందే ఉన్నారు. చాలా ఫ్యామిలీలు క‌రోనా స‌మ‌యంలో థియేట‌ర్ కు దూరం అయ్యాయి. మ‌ళ్లీ థియేట‌ర్ కు వెళ్లే సినిమా చూడాల‌నే ప‌రిస్థితులు వారికి ఇంకా ఎదురుకాలేదు!

దీనికి అనేక కార‌ణాలు. ఎలాంటి సినిమా అయినా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మ‌రెన్నో సినిమాలు డైరెక్టు ఓటీటీ విడుద‌ల వ‌చ్చాయి. బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్ ఉంటే.. రిమోట్ నొక్కితే చాలు.. రోజులు, నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి చూడ‌ద‌గినంత కంటెంట్ అందుబాటులో ఉంటోంది. ఇలాంటి నేప‌థ్యంలో ప్ర‌త్యేకించి థియేట‌ర్ కు వెళ్లాల‌నే భావ‌న క్ర‌మంగా చెరిగిపోతోంది.

దీనికి సౌత్ కొంత మిన‌హాయింపు. ఇప్ప‌టికే ప‌లు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాలు దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. త‌ద్వారా థియేట‌ర్లో సినిమాకు స్థానం మిగిలే ఉంద‌ని నిరూపించాయి. 

అయితే బాలీవుడ్ కు మాత్రం పోస్ట్ కోవిడ్ ప‌రిణామాల్లో చెప్పుకోద‌గిన హిట్ లు లేవు! క‌నీసం మూడొంద‌ల కోట్ల రూపాయ‌ల వసూళ్లు అనే సినిమా కూడా చెప్పుకోవ‌డానికి లేకుండా పోయింది. బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల బ‌డ్జెట్ క‌నీసం 120 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. పెద్ద హీరోల సినిమాల‌కు అయితే 120 నుంచి 150 కోట్ల రూపాయ‌లు త‌ప్ప‌నిస‌రి! ముక్కిమూలిగి ఆ బ్రేక్ ఈవెన్ ద‌శ‌కు రావ‌డం, లేదా డిజాస్ట‌ర్లుగా మిగిలిపోవ‌డం పెద్ద సినిమాల‌కు అక్క‌డ ఆన‌వాయ‌తీగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోలు ఒక‌రి త‌ర్వాత మ‌రొకరుకు బాక్సాఫీస్ దండ‌యాత్ర‌కు వ‌చ్చి వెనుదిరుగుతూ ఉన్నారు. 

ఈ అంశంపై బాలీవుడ్ జ‌నాలు కూడా విశ్లేషించుకుంటూ ఉన్నారు. త‌మ ప‌రిశ్ర‌మ‌కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అంశంపై అక్ష‌య్ కుమార్ తాజాగా స్పందిస్తూ బాలీవుడ్ సినిమాకు మంచి రోజులు రావాలంటే తార‌లు పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని, క‌నీసం ముప్పై న‌ల‌భై శాతం రెమ్యూనిరేష‌న్లు త‌గ్గితే కానీ ప‌రిస్థితి మెరుగ‌వ్వ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

మ‌రి బాలీవుడ్ లో భారీ రెమ్యూనిరేష‌న్ తీసుకుంటున్న స్టార్ హీరోల‌లో అక్ష‌య్ ఒక‌రు. మ‌రి త‌న సినిమాల‌కు కూడా స‌రైన క‌లెక్ష‌న్లు లేక‌పోవ‌డంతో తన మాట మేర‌కు ఈయ‌న అయినా పారితోషికం త‌గ్గించారో లేదో మ‌రి!