మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరోసారి అగ్గిరాజుకుంది. మొన్నటికిమొన్న నరేష్, శివాజీరాజా మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. ఆ వేడి ఇంకా చల్లారకముందే, ఇప్పుడు నరేష్-రాజశేఖర్ కు అస్సలు పడట్లేదనే ప్రచారం ఊపందుకుంది. నిప్పులేనిదే పొగరాదంటారు కదా, ఇది కూడా అలాంటిదే. వీళ్లిద్దరి ఇగో సమస్యల వల్ల ఇప్పుడు మరో కొత్త సమస్య తలెత్తింది.
నిజానికి రాజశేఖర్ ను తెరపైకి తీసుకొచ్చిందే నరేష్. శివాజీరాజా వర్గాన్ని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఆఖరి నిమిషంలో రాజశేఖర్ ను “మా” అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిపారు. చిరంజీవి లాంటి పెద్దల ఆశీస్సులు, మహేష్ లాంటి స్టార్స్ మద్దతు తీసుకున్నారు. అలా నరేష్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదంతా జరిగి ఎన్నాళ్లూ కాకముందే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి.
ఇద్దరి మధ్య విబేధాలు ఏ స్థాయికి చేరాయంటే, నరేష్ వర్గానికి వ్యతిరేకంగా రాజశేఖర్ వర్గం నిన్న ప్రత్యేకంగా సమావేశమైంది. అర్థరాత్రి దాటిన వరకు ఈ సమావేశం జరిగిందట. సంస్థ తరఫున వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి నరేష్ ముందుకు రాకపోవడంతో, అధ్యక్ష స్థానంలో ఉన్న అతడికి ఏకంగా నోటీసులు ఇవ్వాలనేంత వరకు చర్చ వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజశేఖర్, నరేష్ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజశేఖర్ తో పోలిస్తే నరేష్ ఇంకాస్త ఎక్కువ బిజీగా ఉన్నారు. అందువల్ల ఆయన మీటింగ్స్ కు రాలేకపోతున్నారని ఆరోపిస్తోంది రాజశేఖర్ వర్గం. దీనివల్ల సంస్థకు నిధులు సేకరించడం కష్టంగా మారుతోందని, మరీ ముఖ్యంగా పెన్షన్ ప్లాన్ అమలు చేయడం ఇబ్బందిగా మారుతోందని ఆ వర్గం ఆరోపిస్తోంది.
ప్రస్తుతం ఈ కమిటీకి రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆమె ద్వారా ఆ వ్యవహారాన్ని నరేష్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే నరేష్ కు లీకులు అందాయి. తనకు సమాచారం అందించకుండా అర్థరాత్రి వేళ సమావేశమవ్వడంపై నరేష్ కోపంతో ఊగిపోతున్నాడట. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.