కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీ మార్చినట్లే తను ఇటీవల స్థాపించిన రాజకీయ పార్టీ పేరును కూడా మార్చారు. డెమోక్రటిక్ ఆజాద్ పార్టీగా ఉన్న పేరును ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీగా మార్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉన్నత పదవులు అనుభవించిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడప్పుడే అధికారాన్ని సంపాదించుకునే అవకాశాలు లేవనుకునే లెక్కలేశారు. చివరికు కాంగ్రెస్ ని వీడి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. సెప్టెంబర్ నెలలో డెమోక్రటిక్ ఆజాద్ పేరుతో పెట్టిన రాజకీయ పార్టీ పేరును మూడు నెలలు తీరక ముందే మార్చారు.
బహుశా పార్టీ పెట్టినప్పటి నుంచి ఆజాద్ పేరు గానీ, ఆ పార్టీ పేరును కానీ కశ్మీర్ ఆవల ఎవరూ పెద్దగా ప్రస్తావించింది కూడా లేదు! తన పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంటుందని చెప్పిన ఆజాద్ బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎటువంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆజాద్ బీజేపీకి అనుకులంగా పని చేశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయిప్పుడు.
ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆజాద్… వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ పార్టీపైనా, రాహుల్ గాంధీపైనా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్న జీ 23 వృద్ధ నేతలకు ఆజాద్ నాయకత్వం వహించారు.
ఇక కశ్మీర్ లో ఆజాద్ పార్టీ కి స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడప్పుడే తేలే అంశం కాదు. అక్కడ ఎన్నికలు జరిగితే కానీ ఈయన పార్టీపై ఫీడ్ బ్యాక్ రాదు. కేంద్ర ప్రభుత్వమేమో కశ్మీర్ లో ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించేలా లేదు! ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అంతా బాగుందని అంటున్న కమలనాథులు ఎన్నికలు ఎప్పుడో కూడా చెప్పలేకపోతున్నారు!