అత్యంత ఉత్కంఠ రేపుతున్న రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజనపై కూడా ఇదే సందర్భంలో విచారణకు రావడం కీలక పరిణామం. ఈ సందర్భంగా అమరావతి, రాష్ట్ర విభజన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటిని వేర్వేరుగా విచారణ జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రుషికేశ్ రాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.
అమరావతిపై 8, ఏపీ విభజనపై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రెండు కేసులను వేర్వేరుగా విచారించాలని ప్రభుత్వం తరపున కోరినట్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్, మాజీ ఏజీ వేణుగోపాల్ తెలిపారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వ తరపు న్యాయవాది వైద్యనాథన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీర్పుపై స్టే విధించాలని ఆయన అభ్యర్థించారు.
ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 28న అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంటూ వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఏపీ ప్రభుత్వం, అమరావతి జేఏసీతో పాటు రాజధాని అనుకూల, వ్యతిరేక వర్గాలు ఎదురు చూస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలనే ఉత్సాహంతో జగన్ సర్కార్ వుంది.
సుప్రీంకోర్టులో కూడా తమకే అనుకూలమైన తీర్పు వస్తుందని అమరావతి జేఏసీ గట్టి నమ్మకంతో వుంది. ఈ నేపథ్యంలో విచారణపై ఏపీ దృష్టి సారించింది.