ప‌వ‌నే కాదు సిల్క్ స్మిత వ‌చ్చినా…!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చాకిరేవు పెట్టారు. తాడేప‌ల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న సొంత జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌టించి, ప్ర‌త్యేకంగా త‌న పేరు ప్ర‌స్తావించిన నేప‌థ్యంలో ఘాటైన కౌంట‌ర్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చాకిరేవు పెట్టారు. తాడేప‌ల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న సొంత జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌టించి, ప్ర‌త్యేకంగా త‌న పేరు ప్ర‌స్తావించిన నేప‌థ్యంలో ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు. సిల్క్ స్మిత‌తో ప‌వ‌న్‌ను పోల్చారు. అలాగే ప‌వ‌న్ త‌న గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నార‌ని దెప్పి పొడిచారు. ప‌వ‌న్‌కు బొత్స కౌంట‌ర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.

తండ్రి వైఎస్సార్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నివాస గృహాలు క‌ల్పించేందుకు జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం సంక‌ల్పించార‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు సెల‌బ్రిటీ నాయ‌కుడు త‌మ విజ‌య‌న‌గ‌రానికి వెళ్లార‌ని ప‌వ‌న్‌పై సెటైర్ వేశారు. జ‌న‌సేన‌ను రాజ‌కీయ పార్టీగా తాను అనుకోవ‌డం లేద‌ని మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయ పార్టీకి ఒక విధానం, కార్యాచ‌ర‌ణ వుంటాయ‌న్నారు.

విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌గ‌న‌న్న కాల‌నీ నిర్మాణాల్లో రూ.15 వేల కోట్లు అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించార‌ని ఆయ‌న అన్నారు. అయితే అంత మొత్తంలో ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌లేద‌ని ప‌వ‌న్‌కు చుర‌క‌లంటించారు. ప్ర‌జ‌లను మ‌భ్య పెట్టాల‌ని అనుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. చెవిలో పువ్వు పెట్టుకుని తిరుగుతున్నార‌ని అనుకుంటున్నావా? అని ఆయ‌న నిల‌దీశారు. పేద‌ల‌కు ఇళ్లు ఇస్తే త‌ప్పా? అని ప్ర‌శ్నించారు.

మీ రాజ‌కీయ భాగ‌స్వామి (చంద్ర‌బాబు) గ‌త ఐదేళ్ల‌లో ఎంత మందికి ఇళ్లు క‌ట్టించి ఇచ్చారో అడిగావా? అని ప‌వ‌న్‌ను నిల‌దీశారు. ఇంటి స్థలాల కొనుగోలు, అలాగే ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌లో అవినీతికి పాల్ప‌డిన‌ట్టు ఏ ఒక్క‌రైనా ఫిర్యాదు చేశారా? అని బొత్స ప్ర‌శ్నించారు. మీ ఇష్టానుసారం మాట్లాడ్తానంటే కుద‌ర‌ద‌న్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం మంజూరు చేసిన సొమ్ము ఎంత‌, ఖ‌ర్చు చేసిన డ‌బ్బు ఎంత ….త‌దిత‌ర విష‌యాల‌పై క‌నీసం క‌స‌ర‌త్తు చేశావా? అని ప‌వ‌న్‌ను బొత్స ప్ర‌శ్నించారు.

ఏమీ తెలియ‌కుండా ఇష్టానుసారం ఆరోప‌ణ‌లు చేస్తే చూస్తూ ఊరుకుంటారా? విన‌డానికి ప్ర‌జ‌లేమైనా అమాయ‌కులా? అని బొత్స ధ్వ‌జ‌మెత్తారు. చాలా సార్లు చెప్పాన‌ని, సినిమా వాళ్లంటే క్రేజీతో చూడ‌డానికి చాలా మంది వ‌స్తార‌న్నారు. జ‌నం వ‌చ్చార‌ని ఆవేశ‌కావేశానికి లోనై ఊరికే మాట్లాడితే ఎలా అని బొత్స మండిప‌డ్డారు. మీరే కాదు…న‌టి ఎవ‌రైనా వ‌చ్చినా జ‌నం వ‌చ్చేవార‌న్నారు. చ‌నిపోయిన సిల్క్‌స్మిత క‌వ్వించే డ్రెస్‌లో వ‌చ్చినా చూడ‌డానికి భారీగా జ‌నం వ‌చ్చేవాళ్ల‌ని ప‌వ‌న్‌ను అవ‌హేళ‌న చేశారు.

కోట్ల‌లో అవినీతి జ‌రిగింద‌ని ప‌వ‌న్ ఆరోపించ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు. కోట్లు అంటే ఉలెన్‌, పాలిస్ట‌ర్ కోట్లు అనుకుంటున్నావా? అని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద లేఔట్ విజ‌య‌న‌గ‌రంలో ఉంద‌న్నారు. అవినీతి ఎక్క‌డ జ‌రిగిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆ జిల్లాకు బాధ్య‌త వ‌హిస్తున్న మంత్రిగా, సుదీర్ఘ‌కాలంగా అక్క‌డి ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డుతున్న నాయ‌కుడిగా అవినీతి నిరూపిస్తే త‌ల‌దించుకుంటాన‌ని స‌వాల్ విసిరారు.

ల‌బ్ధిదారుల‌తో ఎక్క‌డ మాట్లాడావ‌ని ప్ర‌శ్నించారు. ఏదో నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే ప‌నై పోతుంద‌ని అనుకుంటున్నావా? అని ధ్వ‌జ‌మెత్తారు. ప‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని చూస్తే త‌న‌కు న‌వ్వొచ్చింద‌న్నారు. ఢిల్లీకి వెళ్లి త‌న‌పై వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేస్తున్నార‌ని ప‌వ‌న్ చెప్ప‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. త‌న గురించి ప‌వ‌న్ ఏమ‌నుకుంటున్నాడ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పెద్ద పుడంగి అనుకుంటున్నావా? అంటూ బొత్స త‌న మార్క్ వ్యంగ్యోక్తుల‌తో ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.