ఏపీలో ఎవరు ఏ రకమైన సర్వే చేసిన ఒక విషయంలో మాత్రం అందరికీ ఒకే రకమైన సమాధానం వస్తోంది. అదే ఏపీలో బలమైన జనాభిప్రాయంగా ఉంటోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాల ప్రభావం ప్రజలలో తీవ్రంగా ఉంది. ఈ మధ్య ఒక విపక్ష పార్టీ కోసం చేసిన ఒక సర్వేలో కూడా సంక్షేమ పధకాల మీద వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం డ్యామేజ్ అవుతారు అని వచ్చిందంటున్నారు.
తాజాగా చూస్తే విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పధకాలను అన్నీ కంటిన్యూ చేస్తామని అదనంగా మరిన్ని పధకాలు ప్రవేశపెడతామని జనాలకు హామీ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే జనసేనకు కూడా ఏపీలో సంక్షేమ పధకాల మీద జనాల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అర్ధమైంది అని విశ్లేషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వైసీపీ సంక్షేమ పధకాల మీద చేసిన కామెంట్స్ కి వైసీపీ మహిళా నాయకురాలు, జీసీసీ చైర్ పర్సన్ స్వాతీరాణి రెస్పాండ్ అయ్యారు. ఏపీలో జగన్ అమలు చేస్తున్న అనేక పధకాలు ప్రజలకు చేరువ అయ్యాయని ఆమె అంటూ ఇపుడు దాన్ని విపక్షాలు కూడా చెప్పకుండానే అంగీకరిస్తున్నారు అని పేర్కొంటున్నారు.
రేపటి రోజున ఏపీలో సంక్షేమ పాలన గురించి కానీ ఇతర కార్యక్రమాల గురించి కానీ జనాలే విపక్షాలకు మరింతగా చెప్పి వారు చేసే విమర్శలకు అడ్డుకట్ట వేస్తారని ఆమె అంటున్నారు. ఏపీలో జగనన్న కాలనీలలో ఎక్కడా అవినీతి జరగలేదని, దేశంలోనే అతి పెద్ద గృహ యజ్ఞం ఏపీలో జరుగుతోందని, ఇది ఇంతకు ముందు లేదు, ఇక జరగబోదు అని ఆమె అన్నారు. ఈ విషయం మీద కూడా విపక్షాలు అంగీకరించే రోజు తొందరలోనే ఉంది అని స్వాతీరాణి చెప్పడం విశేషం. ఏపీలో ఇపుడు వైసీపీ సంక్షేమ మీద చర్చ అయితే సాగుతోంది. అది అధికార పార్టీకి అనుకూలంగా ఉండడమే విశేషం.