లవ్ స్టోరీ మేకింగ్ లో యూనిట్ అంతా చాలా కష్టపడింది. 2 లాక్ డౌన్స్, కరోనాను తట్టుకొని మరీ షూటింగ్ చేశారు. ఈ కష్టంలో సాయిపల్లవి పడిన కష్టం మరో ఎత్తు. ఇప్పటికే డాన్స్ పరంగా సాయిపల్లవిపై చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని అందుకోవడం కోసం ''లవ్ స్టోరీ''లో మరింత కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.
“రౌడీ బేబీ సాంగ్ కంటే సారంగదరియాకు చాలా కష్టపడ్డాను. రౌడీ బేబీ సెట్ లో కాస్త వెచ్చగా ఉంది. కానీ లవ్ స్టోరీలో మాత్రం ఒక పాట వర్షంలో చేయాల్సి వచ్చింది. దాంతో కండరాలు పట్టేశాయి. ఇక రెండో పాట సారంగదరియా. ఆ పాటను నైట్ టైమ్ చలిలో చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా కండరాలు పట్టేసి డాన్స్ చేయడం చాలా కష్టమైంది. కానీ ఆ కష్టం పైకి కనిపించకూడదు కదా. అలా లవ్ స్టోరీలో 2 పాటల కోసం చాలా కష్టపడ్డాను.”
అటు నాగచైతన్య కూడా తన డాన్స్ కష్టాల్ని బయటపెట్టాడు. కెరీర్ లో తనకు అతిపెద్ద వీక్ నెస్ డాన్స్ అని, అలాంటిది లవ్ స్టోరీలో డాన్స్ మాస్టర్ గా నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కెరీర్ లో ఇప్పటివరకు ఏ క్యారెక్టర్ కు ఇంతలా కష్టపడలేదన్నాడు.
“నా అతిపెద్ద వీక్ నెస్ డాన్స్. నేను సరిగ్గా డాన్స్ చేయలేను. శేఖర్ కమ్ముల కథ చెప్పిన తర్వాత అంతా బాగానే ఉంది కానీ జుంబా ఇన్ స్ట్రక్టర్ కాకుండా ఇంకేదైనా మార్చమన్నాను. పైగా సాయిపల్లవితో డాన్స్ అంటే ఇంకా కష్టం. కానీ శేఖర్ కుదరదని చెప్పేశాడు. దీంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో గంటలు రిహార్సల్స్ చేశాను. మొత్తానికి ఎలాగోలా చేశాను.”
ఇలా హీరోహీరోయిన్లు ఇద్దరూ తమ డాన్స్ కష్టాల్ని బయటపెట్టారు. ఈ శుక్రవారం లవ్ స్టోరీ సినిమా థియేటర్లలోకి వస్తోంది.