బీజేపీకి జనసేన కండిషన్లు పెట్టే టైమ్ వచ్చిందా!

ఇన్నాళ్లూ జనసేనకు బీజేపీ కండిషన్లు పెట్టింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగిన జనసైనికుల్ని బలవంతంగా వెనక్కు తప్పించింది. ఇటు ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా జనసేనకు మొండి చేయి…

ఇన్నాళ్లూ జనసేనకు బీజేపీ కండిషన్లు పెట్టింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగిన జనసైనికుల్ని బలవంతంగా వెనక్కు తప్పించింది. ఇటు ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా జనసేనకు మొండి చేయి చూపించింది. టోటల్ గా ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా జనసేనను వెనక్కు నెట్టి పొత్తు ధర్మం పేరుతో బీజేపీ హైలెట్ కావాలనుకుంటోంది. అయితే రోజులు మారాయి.

ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన తన ఉనికి చాటుకుంది. బీజేపీ, వామపక్షాలు నామమాత్రంగా మిగిలిపోయిన సందర్భంలో జనసేనకు 2 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. వీరిలో ఎంతమంది ఆ పార్టీతో ఉంటారనే విషయాన్ని పక్కనపెడితే.. గాజు గ్లాస్ అంటూ ఒకటుందని, ఆ గుర్తుపై కూడా కొంతమంది గెలిచారనే విషయం స్పష్టమైంది. అదే సమయంలో బీజేపీ పరువు పూర్తిగా మంటగలిసిపోయింది.
 
బీజేపీ కమలం గుర్తుపై కేవలం 28మంది ఎంపీటీసీలు మాత్రమే గెలిచారు. ఇక జడ్పీటీసీ విజేతలు జీరో. అంటే ఏపీలో బీజేపీ కంటే జనసేన చాలా బెటర్ అనే విషయం స్పష్టమైంది. అదే సమయంలో టీడీపీ కూడా జనసేనను చూసి ఉలిక్కిపడే సందర్భం ఇది.

జనసేనను వైసీపీ లైట్ తీసుకుందా..?

నామినేషన్లు వేసే సమయంలో నయానో భయానో అభ్యర్థులను తనదారికి తెచ్చుకుంటుంది అధికార పార్టీ. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీ నేతల ధాటికి టీడీపీ నిలవలేకపోయింది. చాలా చోట్ల అభ్యర్థులే కరువయ్యారు.

ఉన్నవారు కూడా అధికార పార్టీతో లాలూచీ పడి చివరి నిముషంలో చేతులెత్తేశారు. ఈ క్రమంలో జనసేన అభ్యర్థుల్ని వైసీపీ కాస్త లైట్ తీసుకుందనే విషయం స్పష్టమైంది. అప్పుడు లైట్ తీసుకోబట్టే, ఇప్పుడు వారు తమ ఉనికి చాటుకున్నారు.

గోదావరి జిల్లాలకే పరిమితమా..?

ప్రస్తుతానికి జనసేన తన ఉనికి కాపాడుకున్నా కేవలం గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైందని తెలుస్తోంది. జనసేనకు వచ్చిన ఎంపీటీసీ స్థానాల్లో 95శాతం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నుంచి వచ్చినవే. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వైసీపీకి చెందినవారే ఉన్న నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా ఒకచోట జనసేన జెండా రెపరెపలాడింది. 

మిగతా చోట్ల టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగింది. ఈ క్రమంలో బీజేపీ మాత్రం పూర్తిగా విఫలమైంది. జాతీయ పార్టీ, స్థానిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది.

డామినేషన్ మొదలవుతుందా..?

కూటమి అని పైకి చెప్పుకుంటున్నా, బీజేపీ నేతలు జనసేన కార్యకర్తల్ని చిన్నచూపు చూస్తుండేవారు. కానీ ఇప్పుడు బీజేపీ కంటే జనసేనకే ఏపీలో కాస్త ఎక్కువ బలం ఉందనే విషయం రుజువైంది. 

వైసీపీని ఢీకొనే సత్తా ఉందని చెప్పలేం కానీ.. ప్రతిపక్షాలన్నీ కొట్టుకుంటే కాస్తో కూస్తో జనసేనకి ఊపిరొచ్చినట్టు అర్థమవుతోంది. ఈ ఫలితాలతో ఆ పార్టీలో కూడా ఉత్సాహం పెరిగిందని అంటున్నారు నాయకులు. మొత్తమ్మీద పరిషత్ ఎన్నికల ఫలితాలతో జనసేనపై బీజేపీ స్వారీ చేసే విధానం తగ్గుతుందని అంటున్నారు విశ్లేషకులు.