జగన్ ఒకే ఒక్క ప్రకటన.. చంద్రబాబుకు చెమటలు

కావాలనే చెప్పారో, ముందస్తు వ్యూహమో తెలీదు కానీ, రాబోయే ఎన్నికలపై స్పందించారు జగన్. పీకే ఎంట్రీని కూడా కన్ ఫర్మ్ చేశారు. ''ముందస్తు'' హెచ్చరికలు చేయనప్పటికీ సిద్ధంగా ఉండాలని మంత్రులను కోరారు.  Advertisement జగన్…

కావాలనే చెప్పారో, ముందస్తు వ్యూహమో తెలీదు కానీ, రాబోయే ఎన్నికలపై స్పందించారు జగన్. పీకే ఎంట్రీని కూడా కన్ ఫర్మ్ చేశారు. ''ముందస్తు'' హెచ్చరికలు చేయనప్పటికీ సిద్ధంగా ఉండాలని మంత్రులను కోరారు. 

జగన్ చేసిన ఈ చిన్న ప్రకటన ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబుకు చెమటలు పట్టిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఓవైపు.. జగన్ చేసిన ముందస్తు ప్రకటన మరోవైపు.. వీటితో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చంద్రబాబు.

ప్రస్తుతం టీడీపీ పరిస్థితేంటి?

ఆ మధ్య జమిలి జపం చేశారు చంద్రబాబు. ఎన్నికలు ముందుగానే వస్తాయని, ఏడాదిన్నరలోగా అందరూ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని సందేశాలిచ్చారు. కట్ చేస్తే పంచాయతీ ఎన్నికల ఫలితాలు, తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు పరువుని మరింతగా బజారుకీడ్చాయి. 

ఎంతలా అంటే బాబు తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టు కోల్పోయారు. జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేసిందంటే, బాబు పరువు ఏ రేంజ్ లో గంగపాలైందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో టీడీపీ తిరిగి పుంజుకోవాలంటే అది వెంటనే జరిగే పని కాదు. 

అటు అధికారంలో ఉండి కూడా వైసీపీ ముందస్తుగా ఎన్నికలకు వ్యూహాలు రచిస్తుండే సరికి చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అవుతోంది. ఈ దఫా అధికారం రాకపోతే టీడీపీకి ఏపీలో కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుందనేది వాస్తవం. అందుకే బాబు హడావిడి పడిపోతున్నారు. చినబాబు పట్టాభిషేకాన్ని కళ్లారా చూడలేమోనని బెంగపడుతున్నారు.

పొత్తుల వ్యవహారం ఎంతవరకు వచ్చింది..?

పొత్తులుంటేనే చంద్రబాబుకి మనుగడ. పరువుపోతుందనుకున్న సమయంలో ఆఖరికి కాంగ్రెస్ తో కూడా చేతులు కలపడానికి సిగ్గుపడలేదు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఏపీలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి చరిత్రలో ఎరుగని దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. దీంతో ఆయన 2024 నాటికి ఎలాగైనే మిత్ర పక్షాలను దగ్గరకు చేర్చుకోవాలనుకుంటున్నారు.

కానీ ఏపీలో సీపీఐ మినహా అన్నీ ఆయనకు వైరి పక్షాలుగానే ఉన్నాయి. బీజేపీ కలసి రావడంలేదు, పవన్ కల్యాణ్ లొంగడం లేదు. దీనికితోడు చంద్రబాబు.. యాంటీ-మోడీ గ్రూపులో చేరుతారనే ప్రచారం బాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. దీంతో అనివార్యంగా ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి. అందుకే బాబు ఎన్నికలంటేనే భయపడుతున్నారు, వెనక్కి వెనక్కి వెళ్తున్నారు.

వలసల పరిస్థితేంటి?

దాదాపుగా ప్రతి ఎన్నికల్లోనూ వలస నాయకులకు చివరి నిముషంలో బీ ఫారాలివ్వడం బాబు మరో స్ట్రాటజీ. ఆఖరి నిమిషం వరకు బి-ఫారాలు తన దగ్గరే పెట్టుకొని.. వలస వచ్చిన బలమైన నేతలకు టిక్కెట్లు ఇచ్చేవారు. ఈసారి అలాంటి సూచనలు కనిపించడం లేదు. టికెట్ వచ్చినా, రాకపోయినా జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారనే అభిప్రాయం అందరిలోనూ బలపడింది.

ఎమ్మెల్యే సీటు కాకపోతే, కార్పొరేషన్ పదవి అయినా దక్కుతుందనే ఆలోచనతో ఎవరూ వైసీపీని వదిలి బయటకు రావడానికీ సాహసం చేయడంలేదు. పొరపాటున బయటకు వచ్చి గెలిచినా, తిరిగి వైసీపీలోకి వెళ్లాలంటే సవాలక్ష కండిషన్లు. అందుకే ఎవరూ కనీసం ఆ దిశలా ఆలోచించడంలేదు. అంటే బాబుకి ఉన్న ఆ ఆప్షన్ కూడా గల్లంతేననమాట.

పార్టీ ఫండింగ్ పరిస్థితేంటి?

ముందస్తు ఎన్నికలొస్తే.. పార్టీకి ఫండ్ ఇచ్చే నారాయణ లాంటి వాళ్లు మరోసారి ఆదుకుంటారా? కేశినేని నాని, గల్లా కుటుంబ సభ్యులు డబ్బులు తీస్తారా అనేది అనుమానం. 

పార్టీలో ఉన్న మురళీమోహన్ వంటి కార్పొరేట్లు కూడా మెల్లగా జారుకుంటున్నారు. ఈ దశలో ఆర్థిక పరిపుష్టి లేకుండా వైసీపీని ఎదురొడ్డి నిలవడం టీడీపీకి కష్టసాధ్యం. అనుకున్న టైమ్ కంటే ముందుగా ఎన్నికలొస్తే అది చంద్రబాబుకు మరింత నరకం.

లోకేష్ కు దారేది..?

లోకేష్ ని సీఎం చేయాలనే కల ఎలాగూ నెరవేరలేదు. కనీసం ఆయన్ను ఎమ్మెల్యేగా అయినా చూడాలని అనుకుంటున్నారు బాబు. మంగళగిరి వాసులు కర్రుకాల్చి వాత పెట్టారు, ప్రస్తుతం ఏ నియోజకవర్గాన్ని టచ్ చేసినా షాక్ కొట్టేలా ఉంది. టీడీపీ గెలవడానికి అవకాశం ఎక్కడుందో అర్థం కావడంలేదు, ఒకవేళ అలా ఉన్న చోట స్థానికుల్ని ఇబ్బంది పెడితే వారు కచ్చితంగా లోకేష్ ఓటమి కోసం కృషిచేస్తారనే భయం కూడా వెంటాడుతోంది. లోకేష్ కి అర్జంట్ గా ఓ సెగ్మెంట్ వెదికే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు.

ఇలా ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు చంద్రబాబు ముందున్నాయి. రాబోయే రెండేళ్లలో వీటిని ఒక్కొక్కటిగా నిదానంగా పరిష్కరించుకుందామనుకుంటున్న బాబుకి, జగన్ స్టేట్ మెంట్ చెమటలు పట్టిస్తోంది. ముందస్తు వస్తే బాబుకు చుక్కలే. ఒకప్పుడు ముందస్తు ఎన్నికలంటూ హడావిడి చేసిన బాబు.. ఇప్పుడు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి.