అతగాడో చిన్న డైరక్టర్. చిన్న డైరక్టర్లకు అవకాశాలు రావడమే అదృష్టం. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. చకచకా వర్క్ చేసి సూపర్ అనిపించుకోవాలి.
ముందు సినిమా భలే ఫినిష్ చేసాడు అని నిర్మాత చేత అనిపించుకుంటే, అది మౌత్ టాక్ గా మారి ఇండస్ట్రీలో అవకాశాలు రావడానికి ఓ చాన్స్ వుంటుంది. పాజిటివ్ టాక్ అన్నది కెరీర్ కు చాలా అవసరం.
కానీ ఈ చిన్న డైరక్టర్ కు అదేమీ పట్టినట్లు లేదు. సినిమాను నత్త నడక నడిపిస్తున్నాడు. దాంతో హీరోకి కోపమే, అందులో కీలకపాత్ర వేసిన సీనియర్ ఆర్టిస్ట్ కు కోపమే. అవన్నీ ఏదో విధంగా అధిగమించారు. అయినా ఇంకా గ్రాఫిక్ పనులు కావడం లేదు. సినిమా ఫైనల్ కాపీ సెట్ కావడం లేదు.
దీంతో నిర్మాతకు బీపీ సర్రున లేచింది. నలుగురి మధ్యలో డైరక్టర్ ను పట్టుకుని దులిపి..దులిపి వదిలేసాడని బోగట్టా. ఇంకా ఇదే పనితీరు కొనసాగితే అసలు సినిమా టైటిల్ కార్డ్స్ లోంచి డైరక్టర్ పేరు తీసేస్తాను అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కొసమెరుపు ఏమిటంటే, సదరు చిన్న యువ డైరక్టర్..అన్నింటికి నవ్వడం తప్ప, వేరే ఎక్స్ ప్రెషన్ లేకపోవడం. ఇలాంటి డైరక్టర్ ఓ పొజిషన్ కు చేరాలన్న 'లక్ష్యం' ఎలా చేరుకుంటాడో?