మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసులో భాగంగా ఎల్లో మీడియా జర్నలిస్టు సీఐడీ విచారణకు హాజరయ్యారు. సదరు జర్నలిస్టుకు సంఘీభావంగా ప్రజాసంఘాలు, విపక్షాల నేతలు, కార్యకర్తలు సీఐడీ కార్యాలయానికి వేలాది బారులు తీరారంటూ సదరు చానల్ ప్రసారం చేసింది. ఆయనకు మద్దతుగా ఆ చానల్‌తో మాట్లాడింది ఎవరయ్యా అని చూస్తే… అంతా పచ్చ బ్యాచ్.
తెల్లారిన మొదలు ఆ ఎల్లో చానల్లో ప్యానలిస్టులుగా పాల్గొనే మొహాలే కావడం గమనార్హం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, అమరావతి బహుజన జేఏసీ నేతలు బాలకోటయ్య, కంభంపాటి శిరీషలతో పాటు న్యాయవాదులు ఆ జర్నలిస్టుకు మద్దతుగా మాట్లాడ్డం విశేషం. అదేంటో గానీ, ఒక జర్నలిస్టుకు మద్దతుగా అదే రంగానికి చెందిన నేతలు, సహచరులు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అంటే విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని జర్నలిస్టుగా చూడలేదనే వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే దుష్టచతుష్టయంగా విమర్శించే మీడియా సంస్థల్లో సదరు జర్నలిస్టు పనిచేస్తున్నారు. జర్నలిస్టు సమాజం సీఐడీ విచారణను రాజకీయ కోణంలోనే చూస్తోందని… ఆయనకు ఎవరూ సంఘీభావం తెలపకపోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఆ జర్నలిస్టు విచారణలో భాగంగా సంఘీభావం చెబుతున్న వెల్లువెత్తిన జనాన్ని అదుపు చేయడానికి కేంద్ర బలగాలను రప్పించాలేమో అనే రేంజ్లో సదరు చానల్ ఓవర్ చేయడాన్ని గమనించొచ్చు. కనీసం ఆ జర్నలిస్టుకు సహచరులు కూడా సంఘీభావం తెలపకపోవడం చర్చనీయాంశమైంది. ఈ విచారణ వార్తను తోటి ఎల్లో చానళ్లు పట్టించుకోకపోవడం గమనార్హం.
పైగా ఆయన గారికి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చిన సంస్థల్లో టీడీపీ అనుబంధ సంస్థ తెలుగు యువత ఉంది. పట్టాభి, అమరావతికి సంబంధించిన జేఏసీ నేతలు సంఘీభావం చెబుతుండడం, జర్నలిస్టులు పట్టించుకోకపోవడాన్ని చూస్తే… జగన్ దుష్టచతుష్టయం నామధ్యేయాన్ని ఖరారు చేయడమే అని నెటిజన్లు అంటున్నారు. సమాజ చలనం కోసం కాకుండా, సంచలనాల కోసం తపన పడే సదరు చానల్, జర్నలిస్టు ఉద్దేశాన్ని పసిగట్టడం వల్లే విజ్ఞులెవరూ ఖండించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సదరు జర్నలిస్టుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు, పట్టాభి, టీడీపీ అనుబంధ విభాగాల నేతలు మద్దతు పలకడం ద్వారా దుష్టచతుష్టయం టీం హడావుడిగా పౌర సమాజం చూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటున్నట్టుగానే వారి ప్రవర్తన కూడా వుంటోంది. అందుకే వారి విష ప్రచారానికి విలువ లేకుండా పోయింది.