‘పచ్చ’గా సాగిపోతుందనుకుంటున్న జనసేన-తెలుగుదేశం కాపురంలో చిచ్చు పెట్టేలా వున్నారు మోడీ జీ. జనసేనను తెలంగాణలో పోటీకి ఒప్పించడం ద్వారా ఈ సమస్యకు బీజం వేసారు. ఎనిమిది చోట్ల పోటీకి ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ అభ్యర్ధులను ఎంపిక చేసి జాబితా వదలడం మినహా ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్, భాజపా, భారాస పోటా పోటీగా ప్రచారం సాగిస్తుంటే, పవన్ కేవలం ఒకే ఒక సభలో అది కూడా మోడీతో మొహమాటం కోసం పాల్గొని, ఓ మొక్కు బడి ప్రసంగం చేసి వచ్చారు. ఆ సభలో కూడా జనసేన గురించి ప్రస్తావించలేదు.
అసలు ఏం జరిగింది.. జరుగుతోంది.. అన్నది పవన్ కు మాత్రమే తెలిసిన విషయం కావచ్చు. కానీ జనసైనికుల వరకు ఒకటే సమస్య. తమ పార్టీ అభ్యర్ధులు గెలవాలి. కానీ ఎలా గెలుస్తారు. భాజపాకు అంత దన్ను వుంటే జనసేన మద్దతు ఎందుకు తీసుకుంటుంది. జనసేనకు అంత సీను వుంటే కూకట్ పల్లి లాంటి ఏరియాలో భాజపా అభ్యర్థికే జనసేన కండువా ఎందుకు కప్పుతుంది? ఈ సూక్ష్మంలోనే వుంది అసలు జనసేనకు ఏమైనా సీన్ వుంటుందా వుండదా అనే లాజిక్.
కానీ ఇది కూడా జనసైనికులకు పట్టదు. ఎందకుంటే నూటికి తొంభై మంది జనసైనికులు సినిమా ఫ్యాన్స్. వారికి రాజకీయాలు అంతగా తెలియవు. ఆంధ్రలో పవన్ సిఎమ్ అయిపోవాలి.అంతే. కానీ 175 చోట్ల పోటీ చేయకుండా ఎలా సిఎమ్ అవుతారు అన్నది పట్టదు. మెజారిటీ స్థానాలు గెలుచుకోకుండా ఎలా సాధ్యం అన్నది ఆలోచించరు.
అందుకే అలాంటి జనాలు అంతా ఇప్పుడు తెలంగాణలో తమ పార్టీకి తెలుగుదేశం మద్దతు ఇవ్వాల్సిందే అని గొంతెత్తుతున్నారు. కానీ పాపం తెలుగుదేశం సమస్య వేరు. అక్కడ కేసిఆర్ ను ఓడించేంత సీన్ భాజపాకు లేదని, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే తమకు కొంత ఉపయోగం వుంటుందని నమ్ముతోంది. అందుకే సెటిలర్స్ అనే పేరు చాటున దాగిన తెలుగుదేశం అనుకూల కుల వర్గం అంతా జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటోంది. ఇది జనసేన జనాలకు కోపం తెప్పిస్తోంది.
కూకట్ పల్లి లాంటి చోట తమ అభ్యర్ధి గెలవకపోతే ఇక అంతకన్నా అవమానం ఇంకోటి వుండదు. తెలంగాణలో పరువు దక్కించుకుని, ఆంధ్రలో అడుగు పెట్టాల్సి వుంటుంది. లేదూ అంటే వైకాపా ట్రోలింగ్ మామూలుగా వుండదు. అందుకే తెలుగుదేశం జనాలు తమకు ఓటేయాల్సిందే అన్నట్లు వుంది జనసైనికుల వ్యవహారం.
కానీ అక్కడ ఇంకో తరహా సీన్ వుంది. అసలు ఇప్పుడు తెలంగాణలో పోటీకి దిగాల్సిన పనేముంది అని తెలుగుదేశం అభిమాన జనాలు జనసేన ను తప్పు పడుతున్నారు. దీని వల్ల ఇక్కడ ఆంధ్రలో ఒక కాపురం, ఇక్కడ తెలంగాణలో మరో కాపురం అన్నట్లు పరిస్థితి కనిపిస్తోందని, దీని వల్ల జనాల్లో పలుచన భావం వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆంధ్రలో ఓటింగ్ ను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
భాజపా కలిసి వస్తే ఫరవాలేదు. ఆంధ్రలో భాజపా కలిసి రాకపోతే, జనసేన అప్పుడు తెలుగుదేశం వైపు వెళ్తే పరిస్థితి ఎలా వుంటుంది? విమర్శలు ఎదుర్కోవాల్సి వుంటుంది. అదంతా జనసేన తొందరపాటు నిర్ణయం వల్లే అంటున్నారు.
ఇలా మొత్తం మీద తెలుగుదేశం- జనసేన కాపురంలో చిచ్చు మొదలైంది. ఇదేమీ ఆంధ్రలో విడాకులకు దారి తీయదు కానీ పొత్తు వల్ల కలిగే లాభానికి కాస్త చిల్లు అయితే పెడుతుంది.