వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో ఉండగా, పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరులో 16 రోజుల క్రితం వైసీపీ దళిత నాయకుడు బెనర్జీపై టీడీపీ నేతలు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బెనర్జీ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
టీడీపీ బీసీ నాయకుడు నందం సుబ్బయ్య హత్య కేసులో బెనర్జీ ప్రధాన నిందితుడు. ఇటీవల కాలంలో ప్రత్యర్థులకు బెనర్జీ ఫోన్ కాల్స్ చేస్తూ నందం సుబ్బయ్యను చంపినట్టుగా అంతమొందిస్తానని బెదిరిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. స్వయంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పలువురు కౌన్సిలర్లే తాము బెనర్జీ బాధితులమని, ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయినా ఇంత వరకూ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో ఒక మహిళను బెనర్జీ వేధిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళకు అండగా నిలిచారనే కోపంతో తమ పార్టీకి చెందిన భరత్, రామ్మోహన్‌రెడ్డిలపై బెనర్జీ కక్ష పెంచుకున్నాడని, చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడని టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో 16 రోజుల క్రితం బెనర్జీ, తమ పార్టీ నాయకుడు భరత్ పరస్పరం కొట్టుకున్నారని, ఈ క్రమంలో బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయని అతను తెలిపాడు.
ఈ కేసులో ప్రవీణ్‌పై కూడా కేసు పెట్టడంతో అతను పరారీలో ఉన్నాడు. ఇవాళ ప్రొద్దుటూరుకు వచ్చి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. బెనర్జీపై దాడికి సంబంధించి వివరాలు వెల్లడిస్తుండగా పోలీసులు వెళ్లారు. మీడియా సమావేశం జరుగుతుండగానే, అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే తానెక్కడికీ వెళ్లడం లేదని, పోలీసులకు సహకరించడానికి వచ్చానని ప్రవీణ్ చెప్పడంతో పోలీసులు శాంతించారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరి చారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. దీంతో 16 రోజుల అనంతరం టీడీపీ ఇన్‌చార్జ్ రహస్య జీవితానికి తెరపడినట్టైంది.