అయిన దానికి కాని దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ … స్థానిక ఎన్నికల ఫలితాలపై నోరు మెదపలేదు. అసలు పరిషత్ ఎన్నికల ఫలితాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టు తండ్రీకొడుకుల మౌనమే చెబుతోంది.
దాదాపు ఏడాదిన్నర క్రితం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హయాంలో ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోరు వ్యవహారం నిన్నటి కౌంటింగ్‌తో తెరపడింది. ఈ క్రమంలో ఎన్నో వాదవివాదాలు చోటు నడిచాయి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై భారం వేసి స్థానిక ఎన్నికల బరిలో టీడీపీ నిలిచింది. అయితే పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏంటో టీడీపీకి అనుభవంలోకి వచ్చింది.
అయినప్పటికీ నిమ్మగడ్డ ఏదైనా మ్యాజిక్ చేయకపోతారా, తమ పరుగు నిలబెట్టకపోతారా అనే ఆశతో టీడీపీ ఉండింది. నిమ్మగడ్డ పదవీ కాలం ముగియడంతో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నేతృత్వంలో చేపట్టాల్సి వచ్చింది. ఇదే సాకుగా తీసుకున్న టీడీపీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. కానీ అప్పటికే నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం కూడా ముగిసింది. నీలం సాహ్ని వచ్చిన తర్వాత వారం గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత ఎన్నికలు రద్దు చేయాలని ఆశ్రయించడం, అనంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు అందరికీ తెలిసినవే.
చివరికి కౌంటింగ్‌కు న్యాయస్థానం పచ్చ జెండా ఊపింది. నిన్న కౌంటింగ్ ముగిసింది. టీడీపీ మరోసారి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరు లాంటి పార్టీకి బలమైన పునాదులు, టీడీపీ అధినేతల స్వస్థలాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఫలితాలపై చంద్రబాబు, నారా లోకేశ్ నోరు తెరవలేదు. అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితర నాయకులు మాత్రం… వైసీపీ విజయాన్ని ప్రజాస్వామ్య ఓటమిగా చిత్రీకరిస్తూ తమదైన స్టైల్‌లో స్పందించారు.
స్థానిక ఎన్నికల్లో ఓటమిపై తండ్రీకొడుకుల మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో టీడీపీ శ్రేణులకు అర్థం కాని పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు కష్ట కాలంలో ఉన్నప్పుడు మనోధైర్యం కల్పించాల్సిన చంద్రబాబు, లోకేశ్, ఆ పని చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలొస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో అంతిమంగా రాజకీయ పార్టీల, నేతల భవిష్యత్‌ను శాసించేది ఎన్నికలే. అలాంటి ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి… ఇప్పుడు మాట్లాడేందుకు మొహమెక్కక పోవడం ఓ విచిత్ర పరిస్థితి.