ప్రధాన ప్రతిపక్షంగా తమ ఫెయిల్యూర్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పకనే చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. వైసీపీ ఘన విజయం సాధించడంపై ఆయన అక్కసు వెళ్లగక్కారు.
వైసీపీ విజయాన్ని తక్కువ చేయడానికి పంచ్ డైలాగ్‌లు విసరడం వరకూ బాగానే ఉంది. ఇదే సందర్భంలో అధికార పక్షాన్ని ఎదుర్కోలేని ఆసక్తతను ఆయన మరోసారి తనకు తానుగా ప్రకటించారు.
స్థానిక ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని వెల్లడించదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడే అచ్చెన్నాయుడు టీడీపీ ఓటమిని అంగీకరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జరిగింది సెలక్షనే తప్ప ఎలక్షన్స్ కావని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థులపై దౌర్జన్యాలకు దిగి నామినేషన్లు వేయకుండా అడ్డుకుని పోలీసుల సాయంతో ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు.
అధికార పక్షం ఎలక్షన్స్‌కు బదులు సెలక్షన్స్ చేస్తుంటే ….అడ్డుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తున్నట్టు? ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తుంటే , పరిరక్షించాల్సిన బాధ్యత టీడీపీపై లేదా? అలా కాకుండా బహిష్కరణ పిలుపుతో బాధ్యతల నుంచి ప్రధాన ప్రతిపక్షంగా తప్పించుకోవడం కాదా? తదితర ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. వీటికి అచ్చెన్నాయుడు ఏం సమాధానం చెబుతారు?
ప్రధాన ప్రతిపక్షంగా ఏం చేశారని ప్రజలు ఓట్లు వేయాలో చెప్పాల్సిన బాధ్యత టీడీపీ అధ్యక్షుడిపై ఉంది. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం ఏంటి? ప్రజలు ఐదేళ్లు పరిపాలించాలని పట్టం కట్టారు. గత ఐదేళ్లలో చంద్రబాబు పరిపాలన చూసే… జగన్‌కు పట్టం కట్టారనే విషయాన్ని అచ్చెన్నాయుడు విస్మరిస్తే ఎట్లా?