టీడీపీ ముఖ్య నేతల నుంచి విమర్శలు రావడమే ఆలస్యం…వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లెక్కలపై నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఘాటైన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయసాయిరెడ్డి తండ్రీకొడుకులపై రెచ్చిపోతూ ట్వీట్లతో సమాధానం ఇచ్చారు.
తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్లు పదును తేలాయి. పనిలో పనిగా తండ్రీకొడుకుల్ని హెచ్చరించారు. టీడీపీ నేతలను దొంగల ముఠాతో పోల్చారు. ముందుగా లోకేశ్‌పై ఆయన ట్వీట్ ఏంటో చూద్దాం.
“చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరవును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరక్క పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది” అంటూ ట్వీట్ చేశారు. లోకేశ్‌ను చిట్టి మాలోకం అని అవహేళన చేయడాన్ని చూడొచ్చు. లోకేశ్ అంటే విజయసాయిరెడ్డి ఒంటి కాలిపై దూసుకెళ్లడాన్ని గమనించవచ్చు.
చంద్రబాబుపై కూడా ట్వీట్ చేశారాయన.
“ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన కేవలం ట్రైలరే. కలుగులో దాక్కున్న ఎలుకలా బాబు హైదరాబాద్‌లో గడుపుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతారో. అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరా కుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయారు. ఈ దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే” అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
ఒక్కోసారి విజయసాయిరెడ్డి ట్వీట్లు వివాదం రేకెత్తిస్తున్నాయి. ట్వీట్లలో తాను రెచ్చిపోతూ, ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టడంలో విజయసాయిరెడ్డి రాటు తేలారు. రెండురోజుల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నేతలను మిడతల దండుతో పోల్చడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయసాయి ట్వీట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సీఎం జగన్‌కు లేఖ రాయడాన్ని చూశాం. ఆ లేఖలో విజయసాయి పద్ధతి మార్చుకోవాలని సూచించాలని కోరడాన్ని చూడొచ్చు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ప్రత్యర్థులను విజయసాయి టార్గెట్ చేస్తున్నారు.