పవన్ అయితే, రాష్ట్రం శ్రీలంక కాదు

ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపము…ఈ మాట అన్నది సిఎమ్ జ‌గన్ కాదు. అరకొర సీట్లలో పోటీ చేసి, తేదేపాతో పొత్తు పెట్టుకుని సిఎమ్ కాలేను అని తెలిసి కూడా…

ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపము…ఈ మాట అన్నది సిఎమ్ జ‌గన్ కాదు. అరకొర సీట్లలో పోటీ చేసి, తేదేపాతో పొత్తు పెట్టుకుని సిఎమ్ కాలేను అని తెలిసి కూడా తనను సిఎమ్ ను చేయమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ది. 

నిన్నటి నుంచి ఈ కొత్త రాగం అందుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే లోపల వున్న అనుమానం బయటకు వచ్చిందన్న మాట. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ జ‌గన్ కే ఓటేస్తారేమో? లేదా చంద్రబాబు-పవన్ కాంబో పవర్ లోకి వస్తే సంక్షేమ పథకాలు అటకెక్కించేస్తారని జ‌నం భయపడుతున్నారని అర్థం అయిందేమో?

అందుకే ఈ సంక్షేమ రాగం అందుకున్నారు పవన్. బాగానే వుంది. ఆ వెంటనే ఓ వాలిడ్ పాయింట్ ను అందుకున్నారు వైకాపా అభిమాన జ‌నాలు. ఆపాటి దానికి మళ్లీ నువ్వెందుకు పవన్ బాబూ. ఎలాగూ అమలు చేస్తున్నారు కనుక మళ్లీ జ‌గన్ కే ఓటేస్తే సరిపోతుంది కదా అంటూ అటాక్ మొదలు పెట్టారు.

మరి ఇప్పుడు తెలుగుదేశం జ‌నాలు, దాని సామాజిక మీడియా ఏమంటారో? ఈ సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ తెగ ఊదరగొట్టారు కదా. తమ పత్రికల్లో, తమ చానెళ్లలో, అది చాలక వాట్సాప్ ల్లో తెగ హడావుడి చేసారు కదా. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సంక్షేమ పథకాలు మంచివి. వాటిని తాము కూడా అమలు చేస్తాం. ఇంకా కావాలంటె మరో రూపాయి ఎక్కువే ఇస్తాం అని ఎలా చెప్పగలగుతారు.

మొత్తానికి జ‌గన్ సంక్షేమ రాజ‌కీయాలు పవన్ కు బాబోరికి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.