సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా ఉన్నట్టు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణ వెంటిలేటర్‌పై ఉన్నట్టు పేర్కొన్నారు. 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. శరీరం సహకరిస్తుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. కృష్ణ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థన చేయాలని వైద్యులు చెప్పడం గమనార్హం.
కార్డియాక్ అరెస్ట్‌తో అర్ధరాత్రి సమయంలో ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అప్పటికే ఆయన స్పృహలో లేరని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నారన్నారు. కేవలం 20 నిమిషాల్లో కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు.
అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని కృష్ణకు అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మొదట ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వార్తలొచ్చాయి. త్వరగా కోలుకుని వస్తారని అనుకున్నారు. కానీ వైద్యులు కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్పడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. కృష్ణ కుటుంబంలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల ఆయన మొదటి భార్య ఇందిరాదేవి అనారోగ్యంతో మృతి చెందారు. అంతకు ముందు పెద్ద కుమారుడు రమేశ్‌బాబు, అలాగే రెండో భార్య, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.