ఓ కొత్తమ్మాయికి టాలీవుడ్ లో బహుశా ఇంతకంటే పెద్ద ఆఫర్ ఉండదేమో. అదృష్టం కలిసొస్తే తొలి సినిమాకే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించొచ్చు. బన్నీ సరసన ఓ కొత్త హీరోయిన్ కావాలంటూ కాస్టింగ్ కాల్ వచ్చేసింది. కానీ ఇదంతా మోసం.
అవును.. బన్నీ సినిమాలో హీరోయిన్ వేషం ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. తను గీతా ఆర్ట్స్ లో డిజైనర్, మేకప్ మేన్ అని చెప్పుకుంటున్నాడు. అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తున్నాడు. రిఫరెన్స్ ఇస్తానని నమ్మబలుకుతున్నాడు.
ఇప్పటికే ఇతడి మాయలో పడి కొంతమంది అమ్మాయిలు లక్షల్లో సమర్పించుకున్నారని సమాచారం. ఈ విషయం అలా అలా మెల్లగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ వరకు వెళ్లింది. వెంటనే ఆ సంస్థ రంగంలోకి దిగింది. ఆ కాస్టింగ్ కాల్ ప్రకటనకు తనకు సంబంధం లేదంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది.
గీతా ఆర్ట్స్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్యక్తిని పట్టుకునే పని ప్రారంభించారు. మొన్నటికిమొన్న దర్శకుడు అజయ్ భూపతి పేరిట ఓ బూటకపు కాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చింది. దీనిపై సదరు దర్శకుడు కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా గీతా ఆర్ట్స్ పేరునే వాడుకుంటున్నారు కేటుగాళ్లు.