కొత్త జిల్లాలపై ప్రభుత్వ నిర్ణయం మారుతుందా..?

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు త్వరలో 25 జిల్లాలుగా మారబోతున్నాయనే వార్త వైసీపీ అధికారం చేపట్టినప్పట్నుంచి వినిపిస్తూనే ఉంది. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాలను విభజించే ఆలోచనలో ఉన్న సీఎం జగన్, ఇప్పటికే ఆ…

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు త్వరలో 25 జిల్లాలుగా మారబోతున్నాయనే వార్త వైసీపీ అధికారం చేపట్టినప్పట్నుంచి వినిపిస్తూనే ఉంది. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాలను విభజించే ఆలోచనలో ఉన్న సీఎం జగన్, ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేకాదు, కొత్త జిల్లాలు ఇవేనంటూ ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగింది. అయితే ఆచరణలో మాత్రం ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం లేదా పూర్తిగా రద్దయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే జిల్లాలను విభజించారు. అప్పటికి ఉన్న 10 జిల్లాలను ఏకంగా 33గా విడగొట్టారు. వాస్తవానికి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 17 జిల్లాలు చేయాలనేది కేసీఆర్ తొలి ఆలోచన. అయితే అందరి డిమాండ్లతో అది పెరిగి పెద్దదై 33 జిల్లాల నవతెలంగాణ ఏర్పడింది.

పోనీ దానివల్ల ప్రయోజనం ఏదైనా ఉందా అంటే.. ఆశించిన స్థాయిలో ఏదీ జరగలేదనే చెబుతారు తెలంగాణ వాసులు. కలెక్టర్లు, ఎస్పీలు పెరిగి.. రెవెన్యూ డివిజన్ అధికారులు కనుమరుగయ్యారు. అంతే తప్ప పాలనలో పెద్ద మార్పేమీ రాలేదు. నిధుల కేటాయింపు, అభివృద్ధి-సంక్షేమంలో కూడా తేడాలు కనిపించలేదు.

ఇక ఏపీ విషయానికొద్దాం. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థతో పాలన పూర్తిగా క్షేత్ర స్థాయికి వెళ్లింది. జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ కొత్త నిర్ణయం కూడా తీసుకున్నారు. ఒకరికి రెవెన్యూ, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, ఇంకొకరికి సచివాలయ వ్యవస్థ, మూడోవారికి అభివృద్ధి పథకాలు, పెన్షన్ల పర్యవేక్షణ.. ఇలా పని విభజన జరిగింది. అంటే జిల్లాలు విభజించకుండానే.. విభజనతో వచ్చే ఫలితాలన్నీ ఏపీలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక పేర్లు మార్చడం,  హద్దులు ఏర్పాటు చేయడం లాంఛనం మాత్రమే.

ఈ దశలో శ్రీకాకుళం జిల్లాను విభజించొద్దంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓ సమావేశంలో వ్యాఖ్యానించడం, దానికి స్పీకర్ తమ్మినేని మద్దతివ్వడం జరిగిపోయాయి. వీరిచ్చిన ధైర్యంతో ఇతర జిల్లాల నుంచి కూడా కీలక నేతలు జిల్లాల పునర్విభజనపై తమ అభిప్రాయాలను బైటపెడుతున్నారు. జిల్లాల విభజనలో ఇప్పుడున్న వ్యవస్థను మార్చడం సరికాదనేది మెజార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం.

అయితే ఇన్నాళ్లూ అందరూ జగన్ నిర్ణయానికి ఎదురు చెప్పడం ఇష్టంలేక సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు సీనియర్ నేతలే దీని గురించి మాట్లాడుతుండే సరికి.. ఎలాగోలా తమ నిర్ణయాన్ని జగన్ ముందుకు తీసకెళ్లాలనే ఆలోచనలో అందరూ ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తే.. జిల్లా భౌతిక స్వరూపం పూర్తిగా మారిపోతుంది, జిల్లా కేంద్రం విషయంలో కూడా తలనొప్పి మొదలవుతుంది.

కొన్నిచోట్ల పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల కంటే ఇతర పట్టణాల్లోనే మౌలిక వసతులు ఎక్కువ. ఆ ప్రాంతాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. గతంలో జిల్లా కేంద్రం దగ్గర్లో ఉండేవారు విభజన తర్వాత ఆ సౌలభ్యం కోల్పోతారు. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల విభజనపై పునరాలోచన చేస్తుందని కొంతమంది అభిప్రాయం.

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్