టీడీపీపై ఒకే మాట‌.. కుక్క‌లు చింపిన విస్త‌రి!

ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా అవ‌మానించ‌డం కాదు కానీ, రాయ‌ల‌సీమ టీడీపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ ప‌రిస్థితి కుక్క‌లు చింపిన విస్త‌రి అనేందుకు త‌గ్గ‌ట్టుగా ఉంద‌ని ఒకే మాట‌లో చెప్పొచ్చు! ఒక‌ట‌ని కాదు..  సీమ టీడీపీలో…

ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా అవ‌మానించ‌డం కాదు కానీ, రాయ‌ల‌సీమ టీడీపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ ప‌రిస్థితి కుక్క‌లు చింపిన విస్త‌రి అనేందుకు త‌గ్గ‌ట్టుగా ఉంద‌ని ఒకే మాట‌లో చెప్పొచ్చు! ఒక‌ట‌ని కాదు..  సీమ టీడీపీలో బొక్క‌లు బోలెడ‌న్ని క‌నిపిస్తాయి.

ఆ బొక్క‌ల‌ను స‌రిచేయ‌డం మాట అటుంచితే, అధినేత చంద్ర‌బాబు నాయుడు టీడీపీని గాలికి వదిలేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గాలిలో ఎగిరెగిరి ప‌డుతున్న‌ట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి!

జ‌నం అడ్ర‌స్ మ‌రిచిన నేత‌లు!

సీమ టీడీపీలో మొద‌టి వైఫల్యం గురించి చెప్పాలంటే, టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల అడ్ర‌స్ ను మ‌రిచిపోయారు. అధికారం కోల్పోయి రెండున్న‌రేళ్లు అవుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క కార‌ణాన్ని చూపి ప్ర‌జ‌ల మ‌ధ్యకు వెళ్ల‌లేక‌పోయారు టీడీపీ నేత‌లు. అస‌లు ఆ ఉద్దేశమే లేకున్న‌ట్టుగా ఉంది ఈ నేత‌ల‌కు. ఒక‌ర‌ని కాదు.. నాలుగు జిల్లాల‌నూ గ‌మ‌నించినా, ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు అనిపించుకుంటున్న నేత‌లు ఒక్క‌రంటే ఒక్క‌రూ లేరు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించనేంది కూడా గ‌మ‌నించాల్సిన అంశం.  

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ర‌క‌ర‌కాలుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డానికి అవ‌కాశాల‌ను వెదుక్కోవాలి. అయితే టీడీపీ నేత‌లు మ‌త‌రాజ‌కీయం చేద్దామా, ఏదో ఒక బుర‌ద పూద్దామా అనే అంశాల‌నే న‌మ్ముకున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. మ‌త రాజ‌కీయానికి అవ‌కాశాల‌ను వెదుక్కొంటూ ఉంది టీడీపీ.  అయితే అవి కావాల‌ని చేస్తున్న‌ట్టుగా ఉన్నాయి. దీంతో ఆ ర‌కంగా కూడా ల‌బ్ధి క‌ల‌గ‌డం లేదు. అయినా టీడీపీ మ‌త విష‌వ్యూహాలు ఫ‌లిస్తున్నాయ‌నుకున్నా… దాని ప్ర‌భావితం అయ్యే ఓటు బ్యాంకు ఎంత‌? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. 

ఇలాంటి అంశాల‌తో ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. అంత వ‌ర‌కూ వీటితోనే కాలం గ‌డ‌ప‌డ‌మా? అనేది టీడీపీ ఆలోచించుకోవాల్సిన అంశం. ఏ ఒక్క ప్ర‌జా స‌మ‌స్య‌నూ టీడీపీ స‌రిగా అడ్ర‌స్ చేయ‌డం లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడితే, ప‌చ్చ‌మీడియాలో త‌మ స్టేట్ మెంట్లు అచ్చు అయితే చాల‌న్న‌ట్టుగా.. ఇదే ప్ర‌తిప‌క్ష వాసం అన్న‌ట్టుగా టీడీపీ నేత‌లు భావిస్తున్న‌ట్టుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట‌లు బ‌ద్ధ‌ల‌య్యాయి. 

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా చోట్ల క్యాడ‌ర్ ను నిర్ల‌క్ష్యం చేస్తున్న దాఖ‌లాలూ ఉన్నాయి. ఈ ప‌రిస్థితులను క‌నీసం కంచుకోట‌ల్లో అయినా టీడీపీ వినియోగించుకోవాలి. అయితే సొంత క్యాడ‌ర్ కే టీడీపీ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ భ‌రోసా ఇవ్వ‌లేక‌పోతున్నారు. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ ఎలా త‌మ వైపుకు తిప్పుకోగ‌ల‌రు? అనేది ప్ర‌శ్నార్థ‌కం.

ఇప్ప‌టికీ అదే నేత‌లు!

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు ఫ్యాక్ట‌రీ అని.. ఒక‌రు పోతే వంద‌మందిని చంద్ర‌బాబు నాయుడు త‌యారు చేస్తారంటూ ఆ పార్టీ సోష‌ల్ మీడియా సైనికులు నిన‌దిస్తూ ఉంటారు. అయితే గ్రౌండ్ లెవ‌ల్ కు వెళ్లి గ‌మ‌నిస్తే.. అంత సీన్ లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. అనంత‌పురం వంటి అనుకూల‌మైన చోట కూడా టీడీపీ ఇప్ప‌టి  వ‌ర‌కూ మూడో నేత‌ను త‌యారు చేసుకోలేక‌పోయింది. కొంత‌కాలం కింద‌ట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ చార్జిల‌ను ప్ర‌క‌టిస్తే.. అదే కాలువ శ్రీనివాసులు, అదే పార్థ‌సార‌ధిల‌ను ఇన్ చార్జిలుగా ప్ర‌క‌టించారు.

టీడీపీ త‌ర‌ఫున దాదాపు పాతికేళ్ల నుంచి ఈ రెండు పేర్లే బీసీ నేత‌ల జాబితాలో ఉన్నాయి. అనంత‌పురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాలువ‌,  హిందూపురం లోక్ స‌భ నియోజ‌వ‌క‌ర్గం ప‌రిధిలో పార్ధ‌సార‌ధి.. వీళ్ల నేత‌లు, వీళ్లే జిల్లా అధ్య‌క్షులు. వీళ్లే ఇప్పుడు కూడా మ‌ళ్లీ ఇన్ చార్జిలు. తాము ప్రాతినిధ్యం వ‌హించిన అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గాల్లోనే వీళ్లిద్ద‌రూ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. బీసీ మార్కుతో ఇన్నేళ్లూ వీరు బండి లాగించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున నిలిచిన బీసీ నేత‌లే వీరిని చిత్తుగా ఓడించారు. వీళ్ల ప‌స అయిపోయింది, ప్ర‌జ‌ల‌కు కూడా వీరిపై మొహం మొత్తింద‌నే విష‌యాన్ని టీడీపీ గ్ర‌హించ‌లేక‌పోతోంది. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాలువ‌, పార్థ‌సార‌ధిలు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే… ప‌రిస్థితి ఏమిటో వేరే చెప్పన‌క్క‌ర్లేదు. మ‌రి ప్ర‌త్యామ్నాయంగా ఒక కొత్త నేత‌ను తీసుకోలేక‌పోతున్నారు. పాతికేళ్లుగా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో టీడీపీ సాధించిన ప్ర‌గ‌తి ఇది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వివిధ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త కొత్త బీసీ నేత‌ల‌ను తీసుకొచ్చారు. వారు ఫ‌స్ట్ అటెంప్ట్ లోనే గెలిచారు. మ‌రి త‌మ‌ది బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీలో ఎందుకు.. కొత్త‌గా బీసీ నేత‌లు ఎద‌గ‌లేక‌పోతున్నారు? అనేది టీడీపీ ఆలోచించుకోవాల్సిన అంశం. 

పాత సీసాలోకి కొత్త సారాను నింప‌లేకపోతున్న వైనం స్ప‌ష్టంగా గోచ‌రిస్తోంది. కొత్త నీరు వ‌చ్చి చేరితే టీడీపీలో కొత్త ఉత్సాహం వ‌స్తుందేమో! అయితే స‌మీప భ‌విష్య‌త్తులో టీడీపీ త‌ర‌ఫున కొత్త త‌రం బీసీ నేత‌లు తెర మీద‌కు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. కాలువ శ్రీనివాసులు, పార్థ‌సార‌ధిలు మాత్ర‌మే అనంత‌పురం జిల్లాలో బీసీలు అన్న‌ట్టుగా ఉంది చంద్ర‌బాబు తీరు.  ఇటీవ‌లే కాలువ శ్రీనివాసులు శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి అధికారం చెలాయించ‌బోతే అక్క‌డ కార్య‌క‌ర్త‌లు ఎదురు తిరిగారు. ర‌చ్చ జ‌రిగింది. ఇదీ చంద్ర‌బాబు నియ‌మించిన నేత‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గౌర‌వ‌మ‌ర్యాద‌లు.

కొంద‌రు నేత‌ల‌కు కేసులు!

క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌లకు కేసుల చిక్కులు త‌ప్ప‌డం లేదు. జిల్లాలో టీడీపీకి చుక్కాని అవుతుంద‌నుకున్న భూమా ఫ్యామిలీ భారంగా మారింది. వ్య‌క్తిగ‌త‌, ఆస్తుల వ్య‌వ‌హారాల్లో భూమా ఫ్యామిలీ వ‌ర‌స కేసుల‌ను ఎదుర్కొంటోంది. క‌నీసం  ఆ కేసులు న‌మోదైంది ఏపీలో అయినా అయితే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌క్ష సాధిస్తోందంటూ ప్ర‌చారం చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండేది. అయితే ఆ కేసుల‌న్నీ ప‌క్క రాష్ట్రంలో న‌మోద‌వుతున్నాయి. దీంతో ఈ కేసుల‌ను సానుభూతికి వాడుకునేందుకు కూడా అవ‌కాశం లేక‌పోతోంది. 

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ కేసుల‌ను న‌మోదు చేసిన‌ట్టుగా అయితే భూమా ఫ్యామిలీకి లోకేష్ ప‌రామ‌ర్శ ద‌క్కేది. అయితే ఆ కేసుల‌ను న‌మోదు చేస్తున్న‌ది కేసీఆర్ ప్ర‌భుత్వం కావ‌డంతో లోకేష్ కిక్కురుమ‌న‌డం లేదు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వాయిస్ ను రైజ్ చేసేంత సీన్ లోకేష్ కు లేదు.

ఈ క్ర‌మంలో ఈ అంశంపై రాజ‌కీయం చేద్దామ‌న్నా చేయ‌లేక‌పోతున్నారు. ఇక కేసుల భ‌యంతో క‌డ‌ప జిల్లాలోని నేత‌లు బీజేపీ వైపు దుంకారు. తాము బీజేపీగా చెప్పుకుంటున్నారు. వారు లోపాయికారీగా టీడీపీతో సంబంధాల‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి వారు మ‌ళ్లీ టీడీపీలోకి చేరిపోతార‌ట‌. అనంత‌పురం జిల్లాలోనూ ఒక నేత ఇదే వ్యూహంతో ఉన్నార‌ట‌. ప్ర‌స్తుతానికి ఆయ‌న బీజేపీ. గ‌తంలో టీడీపీ మాజీఎమ్మెల్యే. 

ఇప్పుడు బీజేపీ, రేప‌టి ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ళ్లీ టీడీపీలోకి చేర‌తార‌ట‌. మరి రేపు ఇలాంటి వారు వ‌చ్చి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తే.. కార్య‌క‌ర్త‌ల్లో స్ఫూర్తిని నింప‌గ‌లారా?  పార్టీ అధికారంలో లేక‌పోతే తాము టీడీపీ అని చెప్పుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డేవాళ్లను న‌మ్మి కార్య‌క‌ర్త‌లు ముందుకు వ‌స్తారా? ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు క‌నిపించి, ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత ప‌చ్చ చొక్కాల‌ను విడిచేసి, మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయ‌నంగా ప‌చ్చ చొక్క వేసేసుకుంటే జ‌నాలు ఎగ‌బ‌డి ఓటేస్తారా?  కార్య‌క‌ర్త‌లు వారిని న‌మ్ముతారా?  విశేషం ఏమిటంటే ఇలాంటి నేత‌ల‌కు చంద్ర‌బాబు అండ‌దండ‌లు కూడా ఉన్నాయ‌నేది. వారు కాంట్రాక్టులు, పెండింగ్ బిల్లులు, 

కేసుల భ‌యంతో బీజేపీలోకి చేరి, రేప‌టి ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ళ్లీ టీడీపీలోకి చేరినా.. వారికి చంద్ర‌బాబు నాయుడు అనుకూలంగానే నిలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వారు ప్ర‌స్తుతానికి బీజేపీలో ఉండ‌టం త‌న‌కోస‌మే అని చంద్ర‌బాబు నాయుడు లెక్క‌లేసుకుంటున్నారంటున్నారు. బీజేపీలో త‌న వారు ఉండ‌టం త‌న‌కే మంచిద‌నే చీప్ పాలిటిక్స్ చంద్ర‌బాబు వి. దీంతో వారి అడుగుల‌ను చంద్ర‌బాబు నాయుడు స‌మ‌ర్థించే ప‌రిస్థితి ఉంది. ఎన్నిక‌ల వ‌ర‌కూ బీజేపీలో ఉండి, ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌స్తే వారికి మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయుడు కండువా వేసి, టికెట్ కేటాయించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.  

జ‌నాలు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా ఛీధ‌రించుకునే ఈ రాజ‌కీయానికి చంద్ర‌బాబు నాయుడు ఆమోదం ప‌డే అవ‌కాశాలున్నాయి.  ఇప్ప‌టికే ఆ ప్ర‌చారాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. దీంతో ఇంకా టీడీపీ ప‌ట్ల విధేయంగా ఉన్న కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఈ రాజ‌కీయం ప‌ట్ల అసహ్యం పెర‌గ‌వ‌చ్చు. అయితే వారితో ప‌ట్టింపు లేకుండా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో జ‌రిగేది మాత్రం ఆ రాజ‌కీయ‌మే అని స్ప‌ష్టం అవుతోంది.

అప్ప‌టి జోష్ ఏదీ?

2004 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయింది. అయితే నాడు ప్ర‌తిప‌క్ష వాసంలో కూడా టీడీపీ జోష్  తో క‌నిపించేది. ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన‌ప్ప‌టికీ టీడీపీ నేత‌లుగా చెప్పుకోవ‌డానికి కొంత‌మంది ఉత్సాహం చూపించే వారు. చంద్ర‌బాబు నాయుడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తే వారి హ‌డావుడి మామూలుగా ఉండేది కాదు. ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు పెట్టి మ‌రీ ఏర్పాట్లు చేసే వారు. దార్లంతా ప‌సుపుమ‌యం అయ్యేవి. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. టీడీపీలో అలాంటి జోష్ క‌నిపించేది. 2004 ఎన్నిక‌ల త‌ర్వాత ఎంతో జోష్ క‌నిపించినా, 2009 నాటికి టీడీపీ నెగ్గ‌లేక‌పోయింది. 

ఇక 2009-14 ల మ‌ధ్య‌న టీడీపీకి చాలా సానుకూల ప‌రిణామాలు వ‌చ్చాయి. వైఎస్ మ‌ర‌ణం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ఏక‌ప‌క్షంగా విభ‌జించ‌డం, మోడీ వేవ్ రావ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు.. ఇన్ని క‌లిసి వ‌స్తే 2014లో ఎలాగోలా అధికారాన్ని ద‌క్కించుకుంది. అన్ని ప‌రిణామాలు క‌లిసి వ‌స్తే మాత్రమే టీడీపీ ఒక ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా నిల‌వ‌గ‌ల‌దు. సోలోగా మాత్రం ఆ పార్టీ పాతిక నుంచి ముప్పై శాతం ఓటు బ్యాంకుకే ప‌రిమితం అవుతుంద‌ని వివిధ ఎన్నిక‌ల ఉదాహ‌ర‌ణ‌లు నిలుస్తున్నాయి. మ‌రి ఆ పాతిక‌, ముప్పై శాతం ఓటు బ్యాంకును స్థిరీక‌రించుకునే జోష్ కూడా ఇప్పుడు టీడీపీకి క‌రువ‌య్యింది. 

చంద్ర‌బాబుకు వ‌య‌సు స‌హ‌కారం ఉన్న‌ట్టుగా లేదు. లోకేష్ ఏమో త‌ను ఒక్క రోజు జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చి , దాంతో నాలుగైదు నెల‌ల పాటు బండి న‌డిపించుకోవాల‌న్న‌ట్టుగా చూస్తున్నారు. ఏతావాతా నాలుగు జిల్లాల ప‌రిధిలో టీడీపీ ప్ర‌స్తుత ప‌రిస్థితి మాత్రం కుక్క‌లు చింపిన విస్త‌రి క‌న్నా గొప్ప‌గా లేదు. ఫ‌లితంగా విబేధాలు మ‌రింత‌గా ర‌చ్చకు ఎక్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.