ఇంకా భ్రమల్లోనే బతుకుతున్న బాబు

ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జగన్ ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన కూడా పూర్తిచేసుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తను ప్రతిపక్షంలో ఉన్నాననే విషయాన్ని మరిచిపోతున్నారు. పైపెచ్చు తానింకా భ్రమల్లోనే…

ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జగన్ ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన కూడా పూర్తిచేసుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తను ప్రతిపక్షంలో ఉన్నాననే విషయాన్ని మరిచిపోతున్నారు. పైపెచ్చు తానింకా భ్రమల్లోనే బతుకున్నారు. తన క్యాడర్ ను కూడా భ్రమల్లోనే ఉండమంటూ పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది.

ముఖ్యమంత్రి జగన్ రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై దృష్టిపెడితే.. ప్రజలు మాత్రం రివర్స్ ఎన్నికలొస్తే బాగుంటుందని కోరుకుంటున్నారట. ఇదీ చంద్రబాబు తాజా స్టేట్ మెంట్. ఈ ఒక్క ప్రకటన చాలు చంద్రబాబుకు ఎంత అధికార వ్యామోహం ఉందో చెప్పడానికి. ఈ ఒక్క ప్రకటన చాలు ఆయనింకా భ్రమల్లోనే బతుకున్నారని చెప్పడానికి. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైసీపీ ఓడిపోయి, తిరిగి తను ముఖ్యమంత్రి అయిపోతాననే అర్థం వచ్చేలా మాట్లాడారు బాబు.

కాస్త అతిగా మాట్లాడాననే విషయాన్ని చంద్రబాబు వెంటనే గ్రహించినట్టున్నారు. అందుకే మళ్లీ తన స్టేట్ మెంట్ ను తానే సవరించుకున్నారు. రివర్స్ ఎన్నికలకు ఆస్కారం లేదన్నారు. జమిలీ ఎన్నికలు మాత్రం ఉన్నాయన్నారు. మూడేళ్లలోనే ఎన్నికలొచ్చే అవకాశం ఉందని కళ్లు పెద్దవి చేసుకొని చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు తన క్యాడర్ కు ఏమని సందేశం ఇస్తున్నారు? ఇప్పుడున్న వైసీపీ సర్కార్ ను పట్టించుకోనక్కర్లేదని చెబుతున్నారా? లేక ఇప్పటిదీ మనదే రాజ్యం దున్నకోండని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా?

అఖండ మెజారిటీతో జగన్ గెలిచిన విషయాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. దీంతోపాటు ప్రజలు కేవలం 23 సీట్లకే తనను పరిమితం చేశారనే విషయాన్ని కూడా బాబు ఇంకా నమ్మలేకపోతున్నారు. అందుకే ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే, తను భ్రమలో ఉండడంతో పాటు తన పార్టీని కూడా భ్రమలోకి నెట్టేస్తున్నారు చంద్రబాబు.