తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 10 నెలల క్రితం జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మూడు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా. కానీ, కేవలం మూడేళ్ళలోపే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశముందట. దానిక్కారణం 'జమిలి' ఎన్నికలని బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ప్రధానంగా ఏపీ బీజేపీ నేతలకి మరీ తొందరగా వున్నట్టుంది 'జమిలి' ఎన్నికల విషయమై. అది 'జమిలి' ఎన్నికల మీద ప్రేమగా భావించలేం.. దాన్ని ముందస్తు తొందరగా చెప్పడం కరెక్ట్.
2014 ఎన్నికలలోగానీ, 2019 ఎన్నికలలోగా.. మూడేళ్ళ తర్వాత.. అంటే, 2022 నాటికి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా వుంటాయని ఇప్పుడే ఊహించగలమా.? కానీ, బీజేపీ నేతలు మాత్రం 'ఇంకా ఇంకా బలపడ్తాం..' అని బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. రానున్న రోజుల్లో వరుసగా వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా ఎన్నికల్లో ఫలితాల్ని బట్టి మాత్రమే జమిలి ఎన్నికల విషయమై కేంద్రం సరైన నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నిజానికి, 2018 చివర్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనీ, అందుకు పక్కాగా స్కెచ్‌ని కేంద్రం సిద్ధం చేసిందనీ వార్తలొచ్చాయి. కానీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అంత సాహసం చేయలేకపోయింది. ఈసారి అలా కాదు.. జమిలికి అంతా సర్వం సిద్ధమవుతోందని బీజేపీ నేతలు కాస్త గట్టిగానే చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే జమ్మూకాశ్మీర్ సహా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపు అంశాన్ని కూడా చేపట్టబోతున్నారట.
ఇదిలా వుంటే, అతి త్వరలో హైద్రాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం చేయబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత చింతా మోహన్. ఒకవేళ కేంద్రం ఆ ఆలోచన చేస్తే మాత్రం, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అలజడి తప్పకపోవచ్చు. అయితే, అంత రిస్క్ బీజేపీ చేస్తుందా.? హైద్రాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే బీజేపీకి కలిసొచ్చే అంశాలేంటి.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఏమో, 'జమిలి' వ్యవహారంలో హైద్రాబాద్ అంశాన్నీ బీజేపీ చేర్చిందేమో.! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. జమ్మూకాశ్మీర్ విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి, హైద్రాబాద్ విషయమై నిర్ణయం తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.