రాజకీయ నాయకులు జనాలకు రకరకాల కథలు చెప్పడం మామూలే. ఈ కథలు ఒకరిని మించి ఒకరు చెబుతుంటారు. సాధారణ ఎన్నికలో, ఉప ఎన్నికలో వచ్చినప్పుడో ఈ కథలు మరింత రంజుగా ఉంటాయి.
తెలంగాణలో ప్రస్తుతం దళితబంధు హాట్ టాపిక్ అనే సంగతి అందరికీ తెలిసిందే కదా. దళితబంధు టీఆర్ఎస్ కు పెద్ద ఆయుధమని అనుకుంటుంటే దాన్ని వ్యతిరేకించకుండానే నిర్వీర్యం చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
పాపం …సీఎం కేసీఆర్ చాలా నిజాయితీగా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధు తెచ్చామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. దీంతో ఇప్పుడు ఆయన అభినవ అంబేద్కర్ అయ్యారు. ఇక దళితబంధు పైన కేసీఆర్ సమీక్షలే సమీక్షలు. హుజూరాబాద్ లో దానిపై మంత్రుల భజనలు.
వాస్తవానికి దళితబంధు అనేది ఓట్ల కోసం డబ్బులు పంచే పథకం. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంతే. కానీ దీనిపైనా కేసీఆర్, మంత్రులు కథలు వినిపిస్తున్నారు. ఇలా కథలు వినిపించే వారి జాబితాలో కొత్తగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ చేరాడు.
దళిత బంధు పథకం హుజురాబాద్ ఉపఎన్నిక కోసం పుట్టింది కాదని, దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఈ పథకం అమలు చేసేందుకు దశాబ్దం కిందటే సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశాడని ప్రణాళిక సంఘం బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పాడు.
2002లోనే హైదరాబాద్‌లోని గ్రీన్‌పార్క్ హోటల్లో దళిత మేధావులతో సమావేశాలు నిర్వహించి ఇలాంటి ఎన్నో పథకాల కొరకు ప్లాన్ చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర పురోగతి కోసం అవసరమైన నీటి ప్రాజెక్టులపై ముందుగా దృష్టి సారించి, వాటిని పూర్తి చేసిన అనంతరం దళితుల కొరకు సంక్షేమ పథకాలపై దృష్టి సారించినట్లు చెప్పాడు వినోద్ కుమార్. దళితులందరినీ వ్యాపారస్తులుగా చూడాలనే లక్ష్యంతో మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నాడు.
రాష్ట్రంలో రాబోయే పరిశ్రమలలో కూడా దళితులకు వాటాలు కల్పించి వారిని షేర్ హోల్డర్‌గా మారుస్తామన్నాడు. విదేశీ విద్యలో ఎవరూ అడుగకుండానే మెరిట్ విద్యార్థులకు రూ. 20 లక్షలు ఇచ్చి విదేశీ విద్యను అందిస్తున్నామని చెప్పాడు. ఇంకా ఎన్నోవిషయాలు వినసొంపుగా చెప్పాడు వినోద్ కుమార్. కేసీఆర్ ఈ కథ మర్చిపోయినట్లుగా ఉంది. ఎప్పుడూ చెప్పలేదు.