ఉత్తప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్ కౌంటర్లో మరణించినట్టుగా ప్రకటించారు ఆ రాష్ట్ర పోలీసులు. నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయం వద్ద వికాస్ దుబే పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లో దొరికిన అతడు యూపీ వరకూ చేరే లోపే ఎన్ కౌంటర్ జరగొచ్చని చాలా మంది అంచనా వేశారు. వాళ్ల అంచనాలే నిజమయ్యాయి. ఎన్ కౌంటర్లో వికాస్ దుబే మరణించినట్టుగా పోలీసులు ప్రకటించేశారు.
అయితే ఈ వ్యవహారంలో కాస్త సినిమాటిక్ ముగింపు ఉంది. తీవ్రమైన నేరాలు చేసి పట్టుబడిన చాలా మంది విషయంలో పోలీసులు ఈ మధ్యకాలంలో స్పాట్ జస్టిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో వికాస్ దుబేకు కూడా అదే గతి పడుతుందని భావించారు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో కాస్త సినిమాటిక్ ముగింపు కనిపిస్తూ ఉంది. వికాస్ దుబేను తీసుకుని మధ్యప్రదేశ్ ను దాటిన యూపీ స్పెషల్ టాస్క్ పోలీసుల వాహనం కాన్పూర్ వద్ద బోల్తా పడిందట! వాహనం అలా అడ్డం తిరగ్గానే వికాస్ దుబే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడట. అలా పరార్ అవుతున్న అతడిపై పోలీసులు కాల్పులు జరపగా, అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, ఆసుపత్రికి తరలించగా అక్కడ అతడు మరణించాడని తెలుస్తోంది. ఈ మేరకు యూపీ పోలీసులు ప్రకటించారు.
వాహనం బోల్తా పడటంతో ఒక పోలీసాఫీసర్ కూడా గాయపడ్డారని, ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్టుగా, అతడి పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేమని పోలీసులు ప్రకటించారు. దుబే ఎన్ కౌంటర్ చాలా మంది అంచనా వేసిందే కానీ, పోలిస్ వాహనం బోల్తా మాత్రమే ఈ వ్యవహారంలో చిన్న ట్విస్టు!