క‌మ‌లాపురంలో ఇక ర‌చ్చే!

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం టీడీపీలో ఇక ర‌చ్చే. మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి చేరిక‌కు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త్వ‌ర‌లో తాను చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేర‌నున్న‌ట్టు వీర‌శివారెడ్డి ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో ఇవాళ…

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం టీడీపీలో ఇక ర‌చ్చే. మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి చేరిక‌కు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త్వ‌ర‌లో తాను చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేర‌నున్న‌ట్టు వీర‌శివారెడ్డి ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ను వీర‌శివారెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరాల‌ని లోకేశ్ ఆహ్వానించారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా, అలాగే ఆయ‌న మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న క‌మ‌లాపురం నియోజ‌క వ‌ర్గం నుంచి వీర‌శివారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. దివంగ‌త వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ వెంట వెళ్ల‌లేదు. వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న టీడీపీలో కొన‌సాగారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు రోజు రాత్రి వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికి ఆశ్చ‌ర్యం క‌లిగించారు. కొంత కాలం జ‌గ‌న్‌ను పొగుడుతూ కాలం గ‌డిపారు. అయితే మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలో చేర‌నుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మూడుసార్లు ఓడిపోయిన అభ్య‌ర్థుల‌కు టికెట్ ఇచ్చేది లేద‌ని ఇటీవ‌ల మ‌హానాడులో లోకేశ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం క‌మ‌లాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పుత్తా న‌ర‌సింహారెడ్డి వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడిపోయారు. దీంతో ఆయ‌న్ను మార్చి, వీర‌శివారెడ్డికి టికెట్ ఇచ్చే క్ర‌మంలో పార్టీలో చేర్చుకుంటున్నారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. నారా లోకేశ్‌ను క‌లిసిన అనంత‌రం వీర‌శివారెడ్డిని క‌మ‌లాపురం నుంచి పోటీ చేస్తారా? అని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా…. పార్టీ త‌న సేవ‌ల‌ను ఎలా వినియోగించుకుంటే అలా ప‌ని చేస్తాన‌ని స‌మాధానం ఇచ్చారు. 

ఇటీవ‌ల క‌మ‌లాపురంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వీర‌శివారెడ్డి చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే పుత్తా న‌ర‌సింహారెడ్డి అడ్డుప‌డ‌డంతో చేరిక ర‌ద్దైన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో లోకేశ్‌ను వీర‌శివారెడ్డి క‌ల‌వ‌డాన్ని పుత్తా న‌ర‌సింహారెడ్డి ఎలా తీసుకుంటార‌నే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌పై వీర‌శివ‌, పుత్తా మ‌ధ్య వైరం స్టార్ట్ అవుతుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.