ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ప్రతిపక్షాల రాద్దాంతం, కోర్టుకేసుల వల్ల ఆలస్యమైన ఈ ఫలితాలు, ఈరోజు మధ్యాహ్నం నుంచి దశలవారీగా విడుదలకాబోతున్నాయి. ఈ ఫలితాలతో మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది వైసీపీ. పంచాయితీ ఎన్నికల్లో ఎలాగైతే క్లీన్ స్వీప్ చేసిందో, ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘనవిజయం సాధించబోతోంది.
ఇప్పటికే అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దీనికోసం 958 కౌంటింగ్ కేంద్రాలు, 609 మంది ఎన్నికల అధికారుల్ని నియమించింది ప్రభుత్వం. మధ్యాహ్నం నుంచే ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. మధ్యాహ్నానికి ఎంపీసీటీ, రాత్రికి జెడ్పీటీసీ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అర్థరాత్రి అయినప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు.
7219 ఎంపీటీసీ, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న పోలింగ్ జరిగింది. ఏకంగా దాదాపు కోటి 30 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే కోర్టు కేసుల కారణంగా 5 నెలలకు పైగా ఫలితాలు వెల్లడించలేదు. ఎట్టకేలకు కౌంటింగ్ కు అనుకూలంగా తీర్పు రావడంతో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు.
ఈ ఎన్నికలకు సంబంధించి గతంలోనే 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అటు 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వాటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. తాజా ఎన్నికలతో టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు.