కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సంస్థ ఇప్పటికే మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో కార్పొరేట్ సంస్థ ఈ రంగంపై కన్నేసింది. దిగ్గజ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న అదానీ గ్రూప్, ఇప్పుడు మీడియా రంగంలో అడుగుపెడుతోంది. ఈ మేరకు క్వింట్ మాజీ అధ్యక్షుడు సంజయ్ పుగాలియాను సీఈవో అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ గా నియమించింది.
సంజయ్ కు మీడియా రంగంలో 4 దశాబ్దాల అనుభవం ఉంది. దాదాపు అన్ని ప్రముఖ సంస్థల్లో ఈయన పనిచేశారు. సీఎన్బీసీ, జీ-మీడియా, స్టార్ న్యూస్, ఆజ్ తక్, బిజినెస్ స్టాండర్డ్, నవభారత్ టైమ్స్, బీబీసీ.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అనుభవం సంజయ్ కు ఉంది. మరీ ముఖ్యంగా కొత్త మీడియా సంస్థల ఏర్పాటులో ఈయన అనుభవం అపారం.
ఇప్పుడీ అనుభవమే, సంజయ్ కు అదానీ గ్రూప్ లో స్థానం కల్పించింది. త్వరలోనే అదానీ మీడియా సంస్థల్ని సంజయ్ ప్రకటించబోతున్నారు. అయితే అదానీ గ్రూప్ ప్రధానంగా ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలపైనే దృష్టి పెట్టింది. ప్రింట్ మీడియాకు దూరంగా ఉండబోతోంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో ఇప్పటికిప్పుడు కొత్త ఛానెల్స్, వెబ్ పోర్టల్స్ ఏర్పాటుచేసే ఆలోచనలో లేదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న పలు ఛానెళ్లు, న్యూస్ పోర్టల్స్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతోంది అదానీ గ్రూప్.
గతంలో రిలయన్స్ గ్రూప్ కూడా ఇదే పనిచేసింది. మీడియాలో అడుగుపెడుతూనే నెట్ వర్క్ 18ను దక్కించుకుంది. అటు అంతర్జాతీయంగా చూసుకుంటే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, వాషింగ్టన్ పోస్ట్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో అదానీ గ్రూప్ కూడా పయనిస్తోంది.
హిందీతో పాటు ఒకేసారి దక్షిణాది భాషల్లో న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటుచేసే దిశగా అదానీ గ్రూప్ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఆల్రెడీ మనుగడలో ఉన్న ఛానెల్స్, వెబ్ సైట్స్ పై దృష్టి సారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా మీడియాలో సుస్థిర స్థానం సంపాదించడమే దీని లక్ష్యం.