కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముక్కోణపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇంత కాలం వైసీపీ, టీడీపీ మధ్యే నువ్వానేనా అన్నట్టు రాజకీయం నడిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రత్యామ్నాయం భూమా ఇంటి నుంచే రోజురోజుకూ బలపడుతోంది. టీడీపీ ఇళ్లగడ్డ ఇన్చార్జ్ , మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పెదనాన్న కుమారుడైన భూమా కిశోర్‌రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థి క్రమంగా ఎదుగుతుండడం ఆమెలో ఆందోళన కలిగిస్తోంది.
చెల్లి రాజకీయ పంథా నచ్చకపోవడంతో కిశోర్‌రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు పల్లె బాట పేరుతో ఆయన నేటి (ఆదివారం) నుంచి గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దొర్నిపాడు మండలంలోని తన స్వగ్రామం కొత్తపల్లె సమీపంలోని గోవిందిన్నె నుంచి పల్లెబాట మొదలు పెట్టనున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే విఫలం కావడం, అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఉనికిలో లేకపోవడం తదితర అంశాలను సానుకూలంగా మలుచుకుని తానే ప్రత్యామ్నాయమని చాటి చెప్పుకునేందుకు ఆయన తపిస్తున్నారు.
ఇకపై ప్రతి గ్రామానికి , ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడాలని ఆయన కార్యాచరణ రూపొందించుకున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ వివిధ కారణాల రీత్యా ప్రజలను నేరుగా కలవలేని పరిస్థితి. భర్త భార్గవ్, తమ్ముడు విఖ్యాత్ పది రోజులు ప్రజల్లో, 20 రోజులు పరారీలో అన్నట్టు తయారైందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అఖిలప్రియనా లేక కిశోర్‌రెడ్డి వెంట నడవాలా? అనేది టీడీపీ కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేకున్నారు. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయానికి మాత్రం టీడీపీ కార్యకర్తలు, భూమా అనుచరులు వచ్చారు.