అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేతులెత్తేశారు. ఈయన అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎన్నికయ్యారు. యువజన కాంగ్రెస్‌లో యాక్టీవ్‌గా కొనసాగిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి… వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా జగన్‌కు దగ్గరయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ నెల్లూరు రూరల్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
ఈ క్రమంలో 2014లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ వాయిస్‌ను వినిపించడంలో ముందు వరుసలో ఉంటూ వచ్చారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక, ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల అమలు తప్ప , అభివృద్ధి లేదనే ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా కోటంరెడ్డి అన్న మాటలు చర్చనీయాంశమయ్యాయి.
నెల్లూరు నగరంలోని 18వ డివిజన్ హరనాథపురం ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణం, అలాగే సమీపంలోని మినీ బైపాస్‌కు అనుసంధానంగా రోడ్డు వేయించాలని ఆ ప్రాంత ప్రజలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. ఈ పనులు చేయడానికి తన నిస్సహాయతను వ్యక్తం చేయడానికి కోటంరెడ్డి ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. కార్పొరేషన్‌లో ఒక్క రూపాయి లేదని, దీంతో తానేమీ చేయలేనని ప్రజలకు తేల్చి చెప్పారు. అంతేకాదు, అర్థం చేసుకోవాలని ఆయన వేడుకోవడం గమనార్హం.
“మీరందరూ చదువుకున్న వాళ్లు. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హామీలిచ్చి అదిగో ఇదిగో అంటూ మాట తప్ప లేను. పరిస్థితిని అర్థం చేసుకోండి. సంక్షేమ పథకాల అమలు వల్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి అని బదులిచ్చారు. సంక్షేమ పథకాల అమలు వల్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి” అని కోటంరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా నెలకుంది.
కాకపోతే, కోటంరెడ్డిలా ప్రజల మొహం మీద మిగిలిన ఎమ్మెల్యేలు చెప్పలేని పరిస్థితి. సొంత ప్రభుత్వ విధానాలపై కోటంరెడ్డి ఒక రకమైన నిరసన ప్రకటించేందుకే… బహిరంగంగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాల కోసం ప్రజాప్రతినిధులా? నాయకుల కోసం ప్రజలా? అనేది రానున్న ఎన్నికల్లో వైసీపీ నేతలకు తెలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.