కళ్ల ముందే సినిమా హాల్స్ గతంలోకి వెళ్లిపోతున్నాయి. చూస్తుండగానే ఓటీటీలు వర్తమానంలోకి వచ్చేసాయి. సినిమా హాల్స్ అసలుండవని కాదు కానీ వాటి మీద జరిగే వ్యాపారం మాత్రం మునుపటిలా ఉండదన్నది అందరూ ఒప్పుకుంటున్న సత్యం.
1980ల వరకు అన్ని వయసుల ప్రేక్షకులు హాలుకొచ్చి సినిమాలు చూసేవారు. కారణం అప్పటికి టీవీలు రాలేదు. వచ్చినా అందులో కొత్త సినిమాలు చూసే వెసులుబాటు ఉండేది కాదు. వారానికొక పాత సినిమా వేసేవాళ్లు దూరదర్షన్ వాళ్లు. వేరే ప్రైవేట్ చానల్స్ కూడా అప్పట్లో లేవు.
అందుకే మురళీమోహన్, చంద్రమోహన్, శోభన్ బాబు, శ్రీధర్ లాంటి హీరోల సినిమాలని మిడిలేజ్ ఆడియన్స్ చూసి విజయవంతం చేసేవారు. సందేశాత్మక చిత్రాలు, సంగీత సాహిత్య విలువలున్న సినిమాలు, భక్తిరస చిత్రాలు ఇలా ఏవొచ్చినా ఆడేవి.
కుటుంబ సమస్యలు, అత్తా కోడళ్ల గొడవలు, భార్యాభర్తల మధ్య కలహాలు, బంధాలు-బాంధవ్యాలు వంటి అంశాలతో నడిచేవి ఆ కథలు. 1990ల్లో ప్రైవేట్ చానల్స్ వచ్చినా జగపతిబాబు లాంటి వాళ్లు కూడా ఇలాంటి కథలతో కొన్నాళ్లు బండిలాగారు.
క్రమంగా లెక్కలేనన్ని టీవీ ఛానల్స్ వచ్చాయి. వాటిల్లో పైన చెప్పుకున్న మిడిలేజ్ ప్రేక్షకులకి నచ్చే అంశాలతో డైలీ సీరియల్స్ మొదలైపోయాయి. ఇంట్లోని ఆడవాళ్లు వాటికి అతుక్కుపోయి బయట సినిమా హాల్లో వస్తున్న అటువంటి చిత్రాలని ఆదరించడం తగ్గించారు. దాంతో ఆ కథలతో సినిమా తీయడం మానేసి 18-30 ఏజ్ గ్రూప్ ఆడియన్స్ మాత్రమే ఇష్టపడే సినిమాలు తీయడం మొదలుపెట్టారు నిర్మాతలు.
దాంతో హీరోల లుక్స్ మారిపోయాయి. కుర్ర ప్రేక్షకులకి తగ్గట్టుగా కనపడడానికి, వారికి నచ్చే సినిమాలే చేయడానికి సిద్ధపడి పక్కా మాస్ యూత్ సినిమాలే రావడం మొదలుపెట్టాయి. పాత సినిమాల్లో హీరోలకి పొట్టలున్నా గడిచిపోయేది. ఎందుకంటే పొట్టలున్న మిడిలేజ్ ఆడియన్స్ కూడా వారి సినిమాలకి రాజపోషకులు కాబట్టి. కానీ ఎప్పుడైతే కుర్ర ఆడియన్స్ కోసమే బాక్సాఫీసు సినిమా అనే టైం వచ్చిందో హీరోలకి సిక్స్ ప్యాకుల అవసరం కూడా మొదలయ్యింది. ఈ పరిస్థితి ప్రస్తుతం వరకు కొనసాగుతోంది. ఈ ఏజ్ ఆడియన్స్ సినిమా విడుదలవ్వగానే హాలుమీద పడి మూడు రోజుల్లో చూసేస్తారు. ఆ తర్వాత హాలు ఖాళీయే. అందుకే శత దినోత్సవాలు పోయి మూడు రోజుల పండుగలు మాత్రమే జరుపుకోవడం మొదలుపెట్టింది ఇండస్ట్రీ.
అయితే మరీ అద్భుతమనుకుంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడడం తగ్గించి ఇప్పటికే చాలా ఏళ్లయ్యింది. అది కూడా దసరా, సంక్రాంతి సీజన్లో ఆ వాతావరణం కాస్త ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో అంతా గాల్లో దీపమే.
పైగా కొత్త సినిమా విడుదలైన రెండు నెలలకే ఏదో ఒక టీవీ చానల్లో చూసే వెసులుబాటు ఉండడంతో హాల్లోనే సినిమా చూడాలన్న అవసరం పోయింది.
ఇక 2020లో కరోనా పుణ్యమా (పాపమా) అని యావత్ప్రపంచం చాలానాళ్లు ఇంటికే పరిమితమైపోయి ప్రత్యామ్నాయ వినోదానికి అలవాటు పడింది. ఇదే అదనుగా ఓటీటీలు జనానికి గొడుగుపట్టడం మొదలుపెట్టాయి.
నోట్ల రద్దు టైములో పేటీయం కి టైమొచ్చినట్టు, కరోనా టైములో ఓటీటీలకి ప్రాణం లేచొచ్చింది. కొన్ని పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీలోకే విడుదలైపోవడం వల్ల జనం మరీ సుఖం మరిగారు.
థియేటర్లకి కుటుంబ సమేతంగా వెళ్లి వేలకి వేలు తగలేసే బదులు ఇంట్లోనే 65 ఇంచ్ టీవీ కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. గత ఏడాదిలో పెద్ద సైజు టీవీల సేల్స్ ఎంత ఊపందుకున్నాయో తెలిస్తే జనం థియేటర్స్ కి ఎంత దూరంగా జరగడానికి సిద్ధపడ్డారో అర్థమౌతుంది.
ఇది చాలదన్నట్టు జియో ఇంటర్నెట్ వాళ్లు సెటప్ బాక్స్ పెట్టి పదేళ్ల క్రితం నాటి మామూలు టీవీలని కూడా స్మార్ట్ టీవీలుగా మార్చేస్తున్నారు. రెండు నెలలు అంతా ఫ్రీ అంటూ ఏకంగా 15 ఓటీటీలని రుచి చూపిస్తున్నారు. రుచి మరిగాక ఇక ఆగుతారా? ఏ సినిమా అయినా నేరుగా ఇంట్లోనే చూడడానికి ప్రాధాన్యమిస్తారు.
ఎక్కడో అతిభారీ సినిమాలైతే తప్ప కుటుంబ సమేతంగా హాలుకెళ్లి చూసే పరిస్థితులు ఆ స్థాయికంటే తక్కువ సినిమాలకి ఉండదు. అప్పుడైనా సినిమా విడుదలైన ఒక్క వారంలో స్క్రీన్ చేసుకునే అవకాశం ఇస్తేనే రైట్స్ కొంటామని ఓటీటీలు తమకున్న ఆధిపత్యాన్ని వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే జరిగితే అతిభారీ చిత్రాలకి కూడా తొలివారంలో యువకులు తప్ప వేరే ఆడియన్స్ ఎవ్వరూ హాల్స్ కి రారు. ఆఫ్లైన్ ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కూడా దండగవుతాయి.
ఓటీటీల చేతుల్లోకి సినిమా రంగం వెళ్ళిపోతే ప్రేక్షకులకి, నిర్మాతలకి బాగానే ఉంటుంది కానీ హీరోలకే పెద్ద దెబ్బ.
సినిమా రంగం జుట్టు ఓటీటీల చేతిలోకొస్తే చెప్పిన రేటుకి నిర్మాతలు సినిమాని అమ్మాల్సొస్తుంది.
“50కోట్లు పెట్టి తీసా, హీరోకి మరొక 50 ఇచ్చుకున్నాం…మొత్తం బడ్జెట్ 100 కోట్లయ్యింది…150 కోట్లకి కొనండి బాబూ” అంటే కొనే రోజులు ఉండవు.
“అంత పెట్టి కొంటే మాకేంటి?” అనే లెక్క ఓటీటీలకి కూడా ఉంటుంది కదా.
ఉన్న సబ్స్క్రైబర్స్ ని కాపాడుకుంటూ, కొత్త సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలని వందలేసి కోట్లకి కొంటూ పోతుంటే ఇయర్ ఎండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ నష్టాలు చూపించే ప్రమాదం ఓటీటీలకి లేకపోలేదు. అందుకే సినిమా మేకింగ్ కాస్ట్ మీద ప్రభావం గణనీయంగా పడుతుంది. దాంట్లో అన్నీ ఎలా ఉన్నా ఒక్క హీరో రెమ్యునరేషనే సింహభాగం. కనుక అది తగ్గించుకోక తప్పదు.
“అలా కుదరదు. నేను స్టారుని. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతా ఖర్చుని టెక్నీషియన్స్ ని, ఆర్టిస్టులని కొత్త వాళ్లనో, తక్కువకి వచ్చేవాళ్లనో పెట్టుకుని తగ్గించుకోండి” అని ప్రస్తుతం కొందరు స్టార్ హీరోలంటుంటున్నారు. సమీప భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఓటీటీల్లో స్టార్స్, స్టార్డం లు ఉండవు. అందరూ టీవీ నటులతో సమానమే.
ఓటీటీ వ్యాపారం ఎంత పెరిగినా మునుపటి కుబేరవైభవం రానున్న రోజుల్లో నటీనటులకి ఉండదు. సినిమా హాల్లో సినిమా అంటే ఏడాదికి 150-200 మించి రావు. వాటిల్లో జనం కళ్లల్లో పడేవి కొన్నే ఉంటాయి. ఆ కొన్నింటిలోనే స్టార్స్ కూడా ఉంటారు. కానీ ఓటీటీల్లో విడులయ్యే సినిమాలు ఏడాదికి వేలల్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ థియేటర్స్ మాదిరిగా స్థానం, సమయంతో పని లేదు. పైగా ఇది ప్రపంచవ్యాప్తం. ఇన్నేసి సినిమాల్లో జనం దృష్టిలో పడి స్టార్స్ అవ్వడం చాలా కష్టం. ఎక్కువమంది ఆదరిస్తే పాపులర్ కావొచ్చు తప్ప స్టార్ అవడం, స్టార్డం తో సినీ రంగాన్ని శాసించడం దాదాపు అసాధ్యం.
ఇన్నాళ్లూ నిర్మాతలు స్టార్స్ చుట్టూ తిరిగినట్టుగా ఓటీటీలు కథకుల చుట్టూ తిరుగుతున్నాయి. అద్భుతమైన కథలు రాసి మెప్పించేవారి చేతుల్లో వినోదపరిశ్రమ ఉందిప్పుడు. స్టార్స్ చేతుల్లో కాదు.
కాలక్రమంలో ఎన్నొ మార్పులొచ్చి పాత రంగాలని మింగేసినట్టే ప్రస్తుతం ఎగ్జిబిటర్ మరియు డిస్ట్రిబ్యూషన్ రంగాలు అంతర్థానమవ్వడానికి దగ్గర్లో ఉన్నాయి.
మల్టీప్లెక్సుల్లో రకరకాల బ్రాండ్ షాపులతొ పాటూ సినిమా హాల్స్ కూడా నెమ్మదిగా నడుస్తాయి కానీ అక్కడ సినిమా వ్యాపారం కేంద్రీకృతం మాత్రం అవ్వదు.
– శ్రీనివాస మూర్తి