త‌న‌ను సీరియ‌స్ గా తీసుకోర‌నే ప‌వ‌న్?

ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టి త‌న రాజ‌కీయ ఉనికిని చాటుకోవ‌డం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు దాదాపు అసాధ్య‌మైన ప‌ని. మ‌రోవైపేమో చేతిలో సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయ‌డానికి క‌నీసం ఏ ఏడాదిన్నర…

ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టి త‌న రాజ‌కీయ ఉనికిని చాటుకోవ‌డం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు దాదాపు అసాధ్య‌మైన ప‌ని. మ‌రోవైపేమో చేతిలో సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయ‌డానికి క‌నీసం ఏ ఏడాదిన్నర స‌మ‌య‌మో ప‌ట్ట‌వ‌చ్చు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌స‌గా సినిమాలు ఒప్పుకుంటున్న తీరును గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏ ఐదారు నెల‌ల ముందో సినిమాల‌కు విరామం ఇచ్చి, ఎన్నిక‌లు అయిపోగానే మ‌ళ్లీ సినిమాల బాట ప‌ట్ట‌డం త‌ప్ప మ‌రో మార్గం ఉన్న‌ట్టుగా లేదు!

మ‌రి ఇప్పుడు ఎవ‌రైనా ప‌వ‌న్ ను సీరియ‌స్ గా తీసుకోవాలంటే ఏం చేయాలి? అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ట్టుండి పొత్తుల చ‌ర్చ‌ను ప్రారంభించారు. వాస్త‌వానికి పొత్తుల గురించి ఎప్పుడూ ఎక్కువ ఆలోచించే పార్టీ తెలుగుదేశం! చంద్ర‌బాబు నాయుడు చేతిలో ఆ పార్టీ ప‌డిన‌ప్ప‌టి నుంచి.. దాని పొత్తుల కోసం దేబిరించ‌ని ఎన్నిక‌లంటూ లేవు! 

2019 ఎన్నిక‌ల్లో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ్ కో తో టీడీపీకి ప‌రోక్ష పొత్తు కొన‌సాగింది. కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డానికే ప‌వ‌న్ ను అటు నుంచి పోటీ చేయించారు చంద్ర‌బాబు నాయుడు. ఇదంతా బ‌హిరంగ స‌త్య‌మే. మ‌రి అలాంటి పొత్తుల పార్టీ కూడా పొత్తుల గురించి ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందు ఆలోచిస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటోంది. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం పొత్తులు, ఎత్తులు అంటూ.. మూడు అప్ష‌న్లు ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారు!

ఇదంతా త‌నంటూ ఒక‌డిని ఉన్నానంటూ చెప్పుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ప్ర‌య‌త్నంగా స్ప‌ష్టం అవుతోంది. రాజ‌కీయ కార్య‌చ‌ర‌ణ‌, ప్ర‌జా పోరాటం వంటి వాటి ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ను తాను వార్త‌ల్లో చూసుకోలేడు! వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు.. అంటే మాత్రం ఆయ‌న పేరు చ‌ర్చ‌లోకి వ‌స్తోంది. 

ఇలా త‌న‌ను మిత్ర‌శ‌త్రుప‌క్షాలు సీరియ‌స్ గా తీసుకునేందుకు అనుగుణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పొత్తుల ఎత్తుగ‌డ‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్టుగా ఉన్నారు. అయితే మ‌రీ ఇంత ముందుగా మొద‌లుపెడితే పోను పోనూ ఈ సీరియ‌స్ వ్య‌వ‌హారం కామెడీ అవుతుందేమో!