ఇండియాలో ఉన్న ముస్లింల గురించి తామేం మాట్లాడుతున్నా చెల్లుబాటు అవుతోంది అనే కాన్ఫిడెన్స్ నేతలను కంప్లీట్ గా బ్యాలెన్స్ తప్పేలా చేస్తున్నట్టుగా ఉంది! ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. నేతలు మైనారిటీలపై ఇష్టానుసారం మాట్లాడగలుతున్నారు. 80:20 అంటున్నారు. ఏదైనా అనగలుగుతున్నారు.
ఆహారపు అలవాట్లు, పండగలు, పబ్బాలు, మసీదులు… ఇలా ఏ విషయంలో అయినా యధేచ్ఛగా మాట్లాడుతున్నారు. అదలా ఉంటే వాట్సాప్ యూనివర్సిటీ మరో వైపు! అంతుబట్టని లాజిక్కులతో, అర్థం లేని వాదనలతో వాట్సాప్ యూనివర్సిటీ చెలరేగిపోతూ ఉంటుంది. దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఇదో తంతుగా మారింది.
ఇండియాలో ఉన్న మైనారిటీ వ్యవహారాల గురించి నేతలు ఎలా మాట్లాడినా.. పెద్దగా వ్యతిరేకత లేకపోవచ్చు గాక! ఈ మాటలు వారి రాజకీయానికి ఆయుధాలుగా ఉపయోగపడుతూ ఉండవచ్చు గాక! ఇదే ధోరణిలో హద్దు మీరి.. ప్రవక్త మీద కూడా చెలరేగిపోవడం మొదటికే మోసాన్ని తెస్తోంది.
ఇప్పటి వరకూ ఇండియా అంతర్గత వ్యవహారాల్లోకి ఏ ముస్లిం దేశమూ జోక్యం చేసుకోలేదు. పాకిస్తాన్ ప్రేలాపనలు వంటి వాటిని పక్కన పెడితే.. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా అది ఇండియా అంతర్గత వ్యవహారం అన్నట్టుగా స్పందించిన ముస్లిం దేశాలే ఎక్కువ! ఆ దేశాలేవీ కశ్మీర్ లోని ముస్లింలకు తాము పెద్దన్నట్టుగా భావించలేదు. భారత అంతర్గత వ్యవహారంపై గౌరవాన్ని ఇచ్చాయి. టర్కీ, ఇండోనేసియా లను మినహాయిస్తే ధనిక ఇస్లామిక్ దేశాలేవీ ఆర్టికల్ 370 రద్దు పై కూడా ఓ ఆందోళన వ్యక్తం చేసింది ఏమీ లేదు.
మరి ఇలా దక్కుతున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇష్టం లేదేమో! వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ మరింత రెచ్చిపోయి ఇప్పుడు కొత్త చిక్కులు తెస్తోంది!
ఇప్పుడు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఘోష ఏమిటంటే.. ఇస్లామిక్ దేశాల్లో యూనిటీ ఉందని, హిందువుల్లో లేదట! ఆమిర్ ఖాన్ హిందూ దేవుళ్లను అవమానించాడట! మరోటట! ఇస్లామిక్ దేశాలేమీ భారత అంతర్గత వ్యవహారంలోకి జోక్యం చేసుకోలేదు. మా ప్రవక్తను అవమానించాల్సిన పని మీకేంటి? అంటున్నాయి. దీనిపై వాట్సాప్ యూనివర్సిటీ తెగ రోషాన్ని చూపిస్తోంది!
మరి యూనివర్సిటీ ఇలాంటి రోషాన్ని చూపిస్తుంటే.. బీజేపీనేమో సదరు నేతలను సస్పెండ్ చేసింది. ఇండియాలోని మైనారిటీల విషయంలో కట్టూబొట్టు విషయంలో ఎలాంటి రూల్స్ అయినా మనం చేసుకోవచ్చు కానీ.. మనకు నచ్చినట్టుగా వాళ్లను బతకమనొచ్చు కానీ.. ఇంకా హద్దులు దాటితే.. ఇలా ఆకులు పట్టుకోవాల్సి వస్తుందని వీర జాతీయ వాదులకు అర్థం అవుతోంది కానీ, రోషాన్ని నటిస్తున్నారంతే!