ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా.. సాంకేతిక కారణాల రీత్యా 13 నామినేషన్లు తిరస్కరణకు గురయినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల పరిశీలన తర్వాత చెల్లని నామినేషన్లు 13 తేలినట్టుగా తెలుస్తోంది.
28 మంది నామినేషన్లు వస్తే.. అటు ఇటుగా సగం నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఏదో పేరు కోసం నామినేషన్లు వేయడం, ఫార్మాట్ కూడా అర్థం చేసుకోలేకపోవడం, ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి గైడెన్స్ లేని నామినేషన్లు, అడ్రస్ లేని పార్టీల నేతల నామినేషన్లు స్క్రూటినీ దశలోనే తిరస్కరణకు గురయినట్టుగా ఉన్నాయి.
మిగిలింది 15 నామినేషన్లు. అయితే ఇంకా ఉపసంహరణకు అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. 15 నామినేషన్లు ఉన్న నేపథ్యంలో వీటిలో కొన్ని ఉపంహరణకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండిపెండెంట్, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల్లో ఎంతమంది బరిలోకి నిలుస్తారనేది సందేహమే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ ఉప పోరులో ఉనికిని చాటాలని తాపత్రయపడుతున్న బీజేపీది మాత్రమే సీరియస్ పోటీ అని అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నిక పోరుకు దూరంగా ఉంది. బీజేపీ మాత్రం ఉనికిని చాటడానికి ఆరాటపడుతూ ఉంది.
ఇక బీజేపీకి జనసేన మద్దతు ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఈ ఉప ఎన్నికకు దూరమంటూ జనసేన ఇది వరకే ప్రకటించింది. బీజేపీ పోటీకి దిగిన నేపథ్యంలో జనసేన రూటెటో!