ఏదో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చి ఇక్కడి చోటా మోటా నేతలతో కూడా మాటామంతీ కలిపారంటే అదో లెక్క. అయితే హైదరాబాద్ లోని బీజేపీ కార్పొరేటర్లు ఢిల్లీకి వెళ్లి మరీ ప్రధానమంత్రితో సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది.
ఆ సమావేశంలో మోడీ ఒక్కో కార్పొరేటర్ నీ పేర్లతో పరిచయం చేసుకున్నారట. ఒక్కోక్కరితో ఆప్యాయంగా మాట్లాడారట. వారి కుటుంబ విషయాలూ, పిల్లలు ఏం చేస్తుంటారు, ఏం చదువుతున్నారు.. అనే విషయాలను కూడా మోడీ అడిగి తెలుసుకున్నారట!
ఈ సమావేశంలో వారితో సన్నిహితంగా మాట్లాడటమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అనుగుణంగా పని చేయాలని మోడీ ఉద్భోధించారట. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని మోడీ వారికి ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసినట్టుగా తెలుస్తోంది!
మరి మోడీ మాటలు ఆ కార్పొరేటర్లపై మంత్రాల్లా పని చేస్తాయా… లేదా.. అనే సంగతిని పక్కన పెడితే, మోడీ ప్రయత్నానికి, బీజేపీ వ్యూహ చాతుర్యానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! తమ పార్టీకి చెందిన ఒక నగరంలోని కార్పొరేటర్లతో ఇలా ఒక ప్రధానమంత్రి సమావేశం కావడం జరిగి ఉంటుందా? అనేది దేశ చరిత్ర పుటలను వెదికినా కనపడదు!
ఏ ఎన్నికల వేడిలోనో.. ఇలాంటి సమావేశాలు ఎవరైనా నిర్వహించి ఉంటారేమో! అయితే.. ఇలా మరీ కార్పొరేటర్లతో రాజకీయ సమావేశాలు నిర్వహించి, వారిని ఒక్కొక్కరిగా పలకరించి, రాజకీయంగా బలోపేతం కావడం గురించి స్వయంగా ప్రధాని హోదాలోని వ్యక్తి ఉద్భోదించడం కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయో తేటతెల్లం చేస్తోంది.
రాజకీయంగా బలోపేతం కావడం గురించి కమలం పార్టీ ఎంత కన్ స్ట్రక్టివ్ గా వర్క్ చేస్తోందో.. అనే దానికి ఈ కార్పొరేటర్లతో మోడీ సమావేశం ఒక చిన్న రుజువు. ఏ ప్రతిపక్షంలో ఉన్న పార్టీనో ఇలా చోటామోటా నేతల్లో కూడా కసిని పుట్టించడానికి అధిష్టానం కూడా రంగంలోకి దిగిదంటే అది కూడా పెద్ద విడ్డూరం కాదు.
అయితే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రధాని స్వయంగా కార్పొరేటర్లతో సమావేశం అయ్యి, ఒక రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలనే టార్గెట్ గురించి మాట్లాడటం… పాలిటిక్స్ తప్ప మరో మాటే లేదనే స్పష్టతను ఇస్తోంది.