బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జనసేన ఊసే ఎత్తలేదు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఆంధ్రాకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్ పేరు నడ్డా ప్రకటించాలని జనసేన నేతలు గత రెండు రోజులుగా బీజేపీకి అల్టిమేటం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నడ్డా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కనీస సీఎం అభ్యర్థిగా కాకపోయినా, జనసేన పేరు ప్రస్తావిస్తారేమోనన్న ఆశ జనసేన నేతల్లో ఉండింది. అయితే జనసేన ఆశలన్నీ అడియాసలయ్యాయి.
నడ్డా ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పోవాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నడ్డా ధీమా వ్యాక్తం చేశారు.
జనసేనతో కలిసి ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు పదేపదే చెప్పడం చూశాం. కానీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాత్రం జనసేన, పవన్‌కల్యాణ్ పేర్లను ప్రస్తావించకపోవడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందనే చర్చకు గోదావరి గర్జన సభ తెరలేపింది. పవన్‌కల్యాణ్ వైఖరితో విసిగిపోయి, ఉద్దేశ పూర్వకంగానే విస్మరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనకు ఏపీ బీజేపీ నేతలతో పెద్దగా సంబంధాలు లేవని, ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్నాయని ఇటీవల పవన్ కల్యాణ్ మీడియాతో అన్న సంగతి తెలిసిందే. మరి జాతీయ అధ్యక్షుడు నడ్డా నామ మాత్రంగా కూడా పవన్‌ను పట్టించుకోక పోవడం దేనికి నిదర్శనం?