బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి ఉండగల విజయావకాశాలకు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే స్వయంగా గండి కొట్టేశారా? అనాలోచిత వైఖరి, ‘లోకల్లీ మేడ్ స్క్రిప్ట్’ ను ముందు వెనుకలు చూసుకోకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా చదివేసే అలవాటు వల్ల.. ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చే సమయానికి బీజేపీ తలలు పట్టుకునే దురవస్థను తయారుచేశారా? అనే మీమాంస ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా రేగుతోంది. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభ సాక్షిగా. జెపి నడ్డా.. బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి గొయ్యితవ్వేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంత చేతకాని పరిపాలన అందిస్తున్నా సరే.. ఏపీలోని వైసీపీ సర్కారు చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉన్నంత వరకు కేంద్రం అసమర్థతలతో తనకు ప్రమేయం లేదన్నట్టుగానే జగన్ వ్యవహార సరళి ఉంటోంది. జగన్ తో సానుకూలంగా ఉంటూ.. బిజెపి అనేక పార్టీ ప్రయోజనాలను నెరవేర్చుకుంటోంది.
గతంలో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కూడా.. జగన్ ను సంప్రదించి.. వైసీపీ ఓట్లను రాబట్టుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ.. జరగవలసి ఉన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోగలిగేంత సత్తా బీజేపీకి లేదు. వారికి అనివార్యంగా, తమ కూటమిలో లేని ఇతర పార్టీల మద్దతు చాలా చాలా అవసరం ఉంది.
ఇందుకోసమే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఇదొక ప్రధాన అంశంగా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టొరల్ కాలేజీలో వైసీపీకి ఉన్న సభ్యుల బలం చాలా కీలకం అనే సంగతి అందరికీ తెలుసు.
ఇలాంటి సమయంలో.. ఆ ఎన్నిక పూర్తయ్యే వరకు కేంద్రమే జగన్ ను దువ్వుతూ, ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందే తప్ప.. తేడాగా వ్యవహరించడానికి అవకాశం లేదు. కానీ రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో నడ్డా మాటలు వైసీపీని దూరం చేసుకునే విధంగా ఉన్నాయి. అర్థం పర్థం లేకుండా మాట్లాడే తమ లోకల్ పార్టనర్ పవన్ కల్యాణ్ లాగా నడ్డా మాట్లాడిన మాటలు.. వైసీపీ శ్రేణులకు చిరాకు తెప్పిస్తున్నాయి.
విజయవాడలో జరిగిన మేధావుల సభలో మర్యాదగనే వ్యవహరించిన బిజెపి, రాజమండ్రి సభలో శృతిమించి మాట్లాడింది. బిజెపి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నట్లుగా సాగిన నడ్డా ప్రసంగం జగన్ ను కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఇంత జరిగాక.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో జగన్, ఆ పార్టీకి సహకరిస్తారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
వైసీపీ సహకారం లేకుండా వారు గెలవడం కల్ల!! అయితే… ఎన్నికలోగా.. ఆ పార్టీ పెద్దలు ఏదో ఒకరకంగా జగన్ ను బతిమాలి తమకు అనుకూలంగా ఓటు చేసేందుకు అంగీకరింపజేస్తారన్న అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.