జనసేన రాజకీయం ప్రతి రాజకీయ పార్టీకి గొప్ప గుణపాఠం. రాజకీయాల్లో ఎలా వుండకూడదో జనసేన రాజకీయాల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఉనికిని చరిత్ర ఆ కోణంలోనే రికార్డు చేస్తుంది. రాజకీయాల్లో తప్పటడుగులు సహజం. అయితే వాటిని సరి చేసుకోడానికి ఒక సమయం వుంటుంది. అలా కాకుండా కాలం గడిచే కొద్దీ ఇంకా అలాంటి తప్పటడుగులు వేస్తే…. దానికి కారణం ఎవరు? ముమ్మాటికీ పార్టీ అధినేత పవన్‌కల్యాణే బాధ్యత వహించాల్సి వుంటుంది.
జనసేనకు ఏ ఫిలాసఫీ లేకపోవడమే ఫిలాసఫీ అనే రీతిలో దాని నడక సాగుతోంది. జనసేన ఆవిర్భావం మొదలు ప్రతి అడుగు రాంగ్ ట్రాక్‌లోనే వెళుతోంది. 2014 ఎన్నికలకు ముందు జనసేనను పవన్‌కల్యాణ్ స్థాపించారు. ఎన్నికల్లో నిలబడలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఆయన మద్దతు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత టీడీపీ – బీజేపీ కూటమి పాలనలో తప్పులను ప్రశ్నించలేదు. అదేమంటే రాష్ట్రం విడిపోయి, కొత్తగా పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇష్టం లేదని ఓ సిద్ధాంతం చెప్పారు. మళ్లీ ఏమైందో కానీ, ఎన్నికలకు ఏడాదిన్నర ఉందనగా టీడీపీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు.
నారా లోకేశ్ నిలిచిన మంగళగిరిలో సీపీఐ అభ్యర్థిని నిలబెట్టి, కనీసం అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు. అలాగే భీమవరం, గాజువాకలో చంద్రబాబు ప్రచారం చేయలేదు. దీంతో వాళ్లిద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని జనాలకి అర్థమైంది. ఇలా పైకి మాట్లాడేదొకటి, చేసేదొకటి అనే రీతిలో పవన్ ప్రవర్తన ఉంటూ వచ్చింది. జనాలకు చిర్రెత్తుకొచ్చి, రెండుచోట్ల ఓడగొట్టి మూలన కూచోపెట్టారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడగానే, మళ్లీ బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు.
కనుచూపు మేరలో ఎన్నికలే లేనప్పుడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పోనీ పొత్తు ధర్మంలో భాగంగా రెండు పార్టీలు కలిసి ప్రయాణం సాగించాయా? అంటే అదీ లేదు. కాలం గడిచే కొద్దీ బీజేపీపై జనసేనానికి మొహమెత్తింది. మళ్లీ చంద్రబాబుపై మోజు పెరిగింది. చంద్రబాబుకేమో రోజుకొక మూడ్. ఒక రోజు లవ్ అంటారు, మరొక రోజు తూచ్ అంటారు. బహుశా పవన్‌కల్యాణ్ జీవితంలో స్థిరంగా ప్రేమించే ఏకైక మనిషి చంద్రబాబు ఒక్కరే అయి వుంటారు.
క్షేత్రస్థాయిలో బలపడకుండా, పొత్తు కుదుర్చుకుని రాజకీయ అందలం ఎక్కాలనే పవన్ వ్యూహాన్ని చంద్రబాబు, బీజేపీ నేతలు పసిగట్టారు. కొత్తగా మూడు ఆప్షన్స్‌ను పవన్ తెరపైకి తేవడం రాజకీయ పక్షాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆలూ లేదు, చూలూ లేదు …ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం వుండగా ఈ పొత్తుల గోలేంట్రా బాబు అని విపక్షాల నేతలు తలలు పట్టుకున్నారు.
పవన్‌కల్యాన్ ఆప్షన్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టీడీపీ తమను కరివేపాకులా వాడుకుందనే ఆవేదన జనసేన నేతల్లో కనిపించింది. మళ్లీ బీజేపీతో పొత్తు గుర్తుకొచ్చింది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌ను జనసేన ఏకంగా బీజేపీకి డెడ్‌లైన్ విధించింది. బీజేపీ ఖాతరు చేయలేదు. నడ్డా పర్యటనలో అసలు పవన్‌కల్యాణ్ పేరే ప్రస్తావించలేదు. బీజేపీ మనసులో ఏముందో జనసేనకు అర్థమైందో లేదో మరి.
పవన్‌తో పెట్టుకుంటే నష్టపోతామనే భావనకు వచ్చారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు బీజేపీ నేతలు తమను పట్టించుకోలేదని జనసేనకు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో జనసేన దారేది? పవన్ ఆప్షన్లలో ఒంటరిగా దిగాలనేదే దిక్కవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్‌కల్యాణ్ అనుభవరాహిత్యం, జగన్‌పై ద్వేషం, స్థిరత్వం లేకపోవడం, నిజాయతీ కొరవడడం, ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని, మరోపార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం …ఇలా అనేక అంశాలు అతనిపై అపనమ్మకాన్ని పెంచాయి.
విశ్వసనీయత లేని నాయకుడిగా తయారు చేశాయి. నేడు ఎటూ చెల్లని నాయకుడిగా పవన్ గుర్తింపు పొందారు. అందుకే అతని ఫెయిల్యూర్స్ ప్రతి రాజకీయ పార్టీకి గుణపాఠాలు అని చెప్పడం.