‘ఊ అంటావా, బిజెపి, ఉహూ అంటావా?’ అనే వ్యాసంలో జనసేన-టిడిపి-బిజెపి కూటమి విషయంపై బిజెపి ఎటూ తేల్చటం లేదని రాశాను. నడ్డా ఆంధ్ర పర్యటన సందర్భంగా దీనిపై క్లారిటీ వస్తుందేమో ననుకుంటే రాకపోగా ఆయన రాజమండ్రి సభలో జనసేన పేరే ఎత్తలేదు. బిజెపియే వైసిపిని ఓడిస్తుందని అన్నారు తప్ప కూటమి మాట ఎత్తలేదు. పైగా పవనే తమ కూటమి సిఎం అభ్యర్థి అని గతంలో సోము వీర్రాజు చేసిన ప్రకటనకు మంగళం పాడేశారు. ఆ ప్రకటన వచ్చినపుడు ఇది సహజమే అనుకున్నాం కూడా. ఎందుకంటే బిజెపి తరఫున ఆంధ్రలో పెద్ద స్టేచర్ ఉన్న నాయకుడు ఎవరూ లేరు. పవన్ రాష్ట్రమంతా తెలిసిన నాయకుడు. పవన్‌ను సిఎంగా చూడాలని తహతహ లాడుతున్నవారు లక్షల్లో ఉన్నారు. కానీ పవన్ యిటీవలి ప్రవర్తన కారణంగా బిజెపి వ్యూహం మారినట్లుంది. ‘పొత్తుల విషయంలో అధిష్టానం తగిన సమయంలో తేలుస్తుంది, యీ లోపున ఎవరూ ఏమీ మాట్లాడవద్దు’ అంటూ బిజెపి తాజాగా చేసిన ప్రకటన చూస్తే వాళ్లు ఎటూ తేల్చే ఉద్దేశంలో లేరని స్పష్టమౌతోంది.
పొత్తుల విషయమే కాదు, సిఎం అభ్యర్థి విషయం కూడా ఓపెన్ ఎండ్గానే ఉందని బిజెపి నాయకులన్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అయితే అధికారంలో రావడమంటూ జరిగితే బిజెపి నాయకుడే సిఎం అవుతాడు అని ప్రకటించారు. ఆయన మాట పట్టించు కోనక్కరలేదు అనుకున్నా, పవనే సిఎం అని గతంలో ఒప్పుకున్నదానిపై వెనక్కి తగ్గారనేది మాత్రం క్లియర్. ఎందుకిలా జరిగింది? టిడిపితో పొత్తు విషయంపై పవన్ చేస్తున్న ఒత్తిడికి సమాధానంగా యీ ప్రకటన వచ్చిందా? కావచ్చు. బిజెపితో కూటమి ఏర్పరచినా పెద్ద తేడా ఉండదని, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపితో చేతులు కలిపితేనే వైసిపి వ్యతిరేక కూటమికి బలం వస్తుందని పవన్ కరక్టుగానే అంచనా వేశారు. అయితే యిప్పటివరకు బిజెపి, టిడిపి పట్ల సుముఖంగా లేదు. కూటమిలో తను ఉండాలంటే టిడిపితో పొత్తు అనివార్యం అని పవన్ బిజెపికి ‘రూట్‌మ్యాప్’ ప్రకటన ద్వారా సంకేతం పంపారు.
టిడిపితో పొత్తు విషయంలో బాల్ మీ కోర్టులోనే ఉంది, మీరు తేల్చేదాకా నేను గడప దిగను సుమా, అనే విషయం చెప్పడానికే, ‘బిజెపి రూట్‌మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నా, వస్తే యాక్షన్‌లోకి దిగడమే’ అని పవన్ అన్నారు. అయితే బిజెపి స్పందించలేదు. పవన్ మాట పట్టించుకోనక్కరలేదు అని తన మౌనం ద్వారా తెలిపింది. నిన్నటి ప్రకటనలు చూస్తే టిడిపితో పొత్తు గురించి మరీ పట్టుబడితే పవన్‌ను వదులుకుని ఒంటరిగా ముందుకు వెళ్లడానికి సైతం సిద్ధం అన్నట్లుగా తోస్తోంది. కూటమిలో ఉంటూ కూడా ఒంటరిగా వెళ్లగలమనే ఆప్షన్ ప్రకటించిన పవన్‌కు యిది సమాధానం కావచ్చు. ఆంధ్రపై బిజెపికి మరీ పెద్దగా ఆశలు లేవనేది అందరికీ తెలిసిన విషయం. అన్ని విధాలా సహకరిస్తున్న వైసిపితో పేచీ పెట్టుకుని దాన్ని అర్జంటుగా కూల్చేయాలన్న తొందర లేదు దానికి. 2024 ఎన్నికలలో సాధ్యమైనంత మేరకు టిడిపిని దెబ్బ తీసి, 2024-29 మధ్య ఆ స్థానంలో తను ఎదగాలని చూస్తోందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టిడిపితో జట్టు కట్టి దాన్ని బలపరుస్తుందని అనుకోవడానికి లేదు. అందుకే టిడిపితో పొత్తు గురించి మరీ పట్టుబడితే నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధం అనే సంకేతాన్ని పవన్‌కు యిచ్చినట్లే భావించాలి. నడ్డా రాజమండ్రి ఉపన్యాసమే దానికి నిదర్శనం.
ఇది ఒక జాతీయపార్టీగా, కార్యకర్తలు, పార్టీ నిర్మాణవ్యవస్థ బలంగా ఉన్న పార్టీగా బిజెపి స్టాండ్. ఆంధ్రలో అధికారంలోకి రావడానికి అది ఓపిక పట్టగలదు, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి అమలు చేయగలదు. కానీ ఏకవ్యక్తి కేంద్రక పార్టీగా ఉన్న జనసేనకు అంత ఓపిక లేదు. పవన్‌కు తీరికా లేదు. షార్ట్కట్స్పై ఆధారపడక తప్పదు. కార్యకర్తలు, వ్యూహరచన, మీడియా మద్దతు, కొన్ని ధనిక వర్గాల మద్దతు వగైరాలు పుష్కలంగా ఉన్న టిడిపిని అండగా చేసుకుని అధికారంలోకి రావడానికి పవన్ చూస్తున్నారు. అందువలన బిజెపి, టిడిపిలలో ఎవరో ఒకర్ని వదులుకోవలసి వస్తే, ఆయన బిజెపినే వదులుకుంటాడు. టిడిపితో లోపాయికారీగా కొన్ని ప్రాంతాల్లో నడుస్తూ వస్తున్న ఏర్పాటును అధికారికంగా ప్రకటించి, దూకుడుగా ముందుకు వెళతాడు. ఎందుకంటే సాధ్యమైనంత త్వరగా జగన్‌ను గద్దె దింపడం పవన్, బాబులకు వ్యక్తిగత ప్రతిష్ఠకు చెందిన వ్యవహారం.
కూటమి ఏర్పాట్లేవో ఎన్నికలకు ముందు చేసుకోవచ్చులే అని బిజెపి తాత్సారం చేయగలదు కానీ టిడిపి, జనసేనలు చేయలేవు. ఎందుకంటే వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు యిప్పణ్నుంచి ఒక ఏడాది పాటు చేస్తే తప్ప ‘ఇది బలమైన ప్రత్యామ్నాయం’ అని ప్రజల్ని నమ్మించడం కష్టం. కొన్ని వర్గాలను ఆకట్టుకుని, మిగతావాళ్లను గాలికి వదిలేయడమే వైసిపి స్ట్రాటజీ. ‘రాబింగ్ పాల్ టు పే పీటర్’ అని ఇంగ్లీషులో సామెత ఉంది. పాల్‌ను దోచి, పీటర్‌కు దోచిపెడుతున్నంత కాలం పీటర్ మద్దతు ఖాయం అని మార్క్ ట్వేన్ చమత్కరించాడు. వైసిపిది అదే ధీమా. కానీ అటు పీటరూ కాక, యిటు పాలూ కాక మధ్యలో ఉన్నవారి సంగతేమిటి? వాళ్లలో ఒక 6-7 శాతం మంది అటు నుంచి యిటు మొగ్గితే వైసిపిని ఏ 70-80 సీట్ల దగ్గరో ఆపేయవచ్చు కదా! మొన్న నేను సర్వే ఫలితాలపై ఆర్టికల్ రాసినపుడు ఒకాయన అన్నారు. మీరు ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో ఉన్న అసంతృప్తి గురించి రాశారు కానీ రైతు వర్గాల్లో చాలా ఉంది. వాళ్లకు బీమా సదుపాయం పోయింది, అమ్మినదానికి డబ్బులు రావటం లేదు అన్నారు. గణాంకాలతో సరైన ఆర్టికలేదీ నేను చదవకపోవడం వలన నాకు తెలియలేదు.
సంక్షేమ పథకాలు అందని ఇలాటి అనేక వర్గాల్లో ఉన్న అసంతృప్తిని పట్టుదలతో, కృషితో, ప్రణాళికతో ఎన్‌క్యాష్ చేసుకోగలిగితే వైసిపిని ఓడించడం సాధ్యమే. దానికి టిడిపి, జనసేన వర్గాలు ఏకం కావాలి, బద్ధకం విడిచి కార్యాచరణలోకి దిగాలి. టీవీలు, పత్రికా ప్రకటనలు పక్కన పెట్టి యింటింటికి వెళ్లి కన్విన్స్ చేయాలి. దీనికి సమయం అవసరం. టిడిపి క్యాడర్, పవన్ గ్లామర్ తోడై కూటమి ఎంత త్వరగా ఏర్పడితే అంత లాభం. అయితే దీనికి ప్రధాన అవరోధం, కూటమి నెగ్గితే ఎవరు సిఎం అవుతారు అనే సందేహం. కూటమికి నాయకత్వం నాదే అంటున్నారు బాబు. ఎవర్నో సిఎంను చేయడానికి మేం యిక్కడ లేము అంటున్నారు పవన్. చేయవలసిన త్యాగాలు గతంలోనే చేశాం, ఫలాలు అందుకోవలసిన సమయం యిప్పుడు వచ్చింది అంటున్నారు.
కానీ బాబు సిఎం అవరంటే టిడిపి వర్గాలు హుషారుగా ముందుకు వస్తాయా అనే అనుమానం టిడిపి నాయకత్వానికి ఉంది. అందుకే మనకే సొంతంగా 160 సీట్లు వస్తాయని వాళ్లు కార్యకర్తలను హుషారు చేస్తున్నారు. మహానాడుకి జనం రావడం చూసి ఉప్పొంగి, వేరేవాళ్లను సిఎం చేయవలసిన అవసరం మనకేముంది అనుకుంటున్నారు. ఆ ధోరణి కనిపెట్టే పవన్ మాకు మూడు ఆప్షన్లున్నాయి అంటూ హెచ్చరిస్తున్నారు. టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సిఎం అనేది చప్పున తేల్చుకుని ప్రకటిస్తేనే కథ ముందుకు సాగుతుంది. పవన్ కింగ్‌మేకర్ గానే ఉండాలి తప్ప కింగ్ కాకూడదని టిడిపి అనుకుని ఆ విధంగా ప్రవర్తిస్తే కూటమి ఏర్పడడం కష్టం. సీట్ల సంఖ్య బట్టి సిఎం ఎవరో తేల్చుకోవాలి అంటే జనసేన కంటె టిడిపికే సీట్లు ఎక్కువ వస్తాయి. పవన్ సిఎం కాలేరు. కానీ జనసేన మద్దతు లేనిదే టిడిపి అధికారంలోకి రాలేని పరిస్థితి ఉంటే..?
ఒక సినారియో ఊహించండి. ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో 5 సీట్లు బిజెపి, ఇండిపెండెంట్లకు పోగా, వైసిపి, టిడిపిలకు చెరో 70-75 సీట్లు వచ్చి ఆగిపోయాయనుకోండి. జనసేనకు 25 వస్తే అది ఎవరికి మద్దతిస్తే వాళ్లదే అధికారం. జనసేనకు 25 రాకుండా, ఏ 15 దగ్గరో ఆగిపోతే మాత్రం బాబు ఓ 10 మందిని గోడ దూకించి, ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తారు. ప్రజారాజ్యం అలా చెల్లాచెదురై పోతుందని భయపడే చిరంజీవి పార్టీని కాంగ్రెసులో కలిపేశారు. జనసేనకు 25 సీట్లున్నా తనను సిఎం చేయాలని పవన్ అడిగితే బాబు కాదనకూడదు. అంటే మాత్రం అధికారం చేజారిపోతుంది. అందువలన మొదటే ఒక ఒప్పందం రాసుకోవాలి. కూటమి నెగ్గితే, మొదటి రెండున్నరేళ్లు పవన్ సిఎం అని, తర్వాతి రెండున్నరేళ్లు లోకేశ్ సిఎం అని, బాబు మెంటార్‌గా ఉంటూ యిద్దరికీ దిశానిర్దేశం చేస్తారనీ అనుకోవాలి. బాబు ముఖ్యమంత్రి, పవన్ ఉపముఖ్యమంత్రి అంటే కుదరదు. ఎందుకంటే రాష్ట్రంలో ఐదారుగురు ఉపముఖ్యమంత్రులుండే కాలం యిది. ఆ పదవికి విలువ లేదు.
లోకేశ్ స్థానంలో బాబును సిఎంగా ప్రకటించకపోతే టిడిపి కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఉత్సాహం ఉండదని కొందరు భావించవచ్చు. శివసేన అధికారంలోకి వచ్చినపుడు బాల ఠాక్రే ముఖ్యమంత్రి కాలేదు. రిమోట్ కంట్రోలుతో ప్రభుత్వాన్ని నడిపారు. కొందరు నాయకులు ఆసుపత్రులలోనో, జైలులోనో ఉన్నపుడు అక్కణ్నుంచే ఆదేశాలిస్తూ ప్రభుత్వాన్ని నడిపిన సంఘటనలూ ఉన్నాయి. బాబు చూడని పదవి కాదిది. ఉమ్మడి రాష్ట్రాన్నే తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తికి యిదెంత? పవన్ తర్వాత రెండున్నరేళ్ల పాటు ఆయన సిఎం అవుతారు అనేది వినడానికి బాగోదు. లోకేశ్, పవన్‌లలో ఎవరు ముందు, ఎవరు వెనుక అనే విషయాన్ని లాటరీ ద్వారా కూడా తేల్చుకోవచ్చు అనవచ్చు. కానీ దాని కంటె తొలి టర్మ్ సిఎం పవన్ అని ప్రకటించడంలో ఒక లాభం ఉంది. టిడిపి-జనసేన కూటమి అంటే కమ్మ, కాపుల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్న సందేహం ఉంది. కానీ పవన్ సిఎం అనగానే కాపుల్లో ఉత్సాహం పెల్లుబుకుతుంది.
సంఖ్యాపరంగా కాపులు గణనీయంగా ఉన్నా, యిప్పటిదాకా కాపు సిఎం లేరు. రాష్ట్రవిభజన తర్వాత, ఆంధ్రలో కాపులు మెజారిటీలో ఉన్నా యిప్పుడు కూడా సిఎం పదవి దక్కకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. పవన్ కనీసం రెండున్నరేళ్ల పాటైనా సిఎం అవుతాడంటే అన్ని పార్టీలలోని కాపులూ కూటమికి ఓటేయవచ్చు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న కాపులు వేయరేమో అనుకోనక్కరలేదు. పథకాల డబ్బు జగన్ జేబులోంచి యివ్వటం లేదని అందరికీ తెలుసు. నేనే యిస్తున్నా, అందుకే యింట్లో మనిషి అయిపోయా అని మోదీ యాడ్స్ ద్వారా చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడున్న పద్ధతిలోనే పథకాలు కంటిన్యూ చేస్తామనే హామీ కూటమి యిస్తే చాలు. ప్రాధాన్యతలు మారతాయి. కాపు ముఖ్యమంత్రి అనగానే చాలామంది బిసిలు కూటమికి ఓటేయరనే వాదన ఒకటుంది. అది నిజమే అనుకున్నా, వారి స్థానంలో అగ్రవర్ణాల ఓట్లు వచ్చి చేరతాయని అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ పాలనలో బిసి, ఎస్సీ, మైనారిటీ జపం హద్దులు దాటింది. ఆ కులాలలోని మధ్యతరగతి వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు.
అంతా బాగానే ఉంది కానీ యీ ఏర్పాటుకు కమ్మలు ఏమనుకుంటారనేది ముఖ్యమైన ప్రశ్న., పోయిపోయి ఓ కాపుని సిఎం చేయడానికా మనం యిన్నాళ్లూ జగన్‌తో ఫైట్ చేస్తూ వచ్చినది అని కొందరు అనుకోవచ్చు. అదేదో రెండున్నరేళ్లేగా, పైగా ఆ సమయంలో ముఖ్యమైన శాఖలన్నీ మనవాళ్లే తీసుకోవచ్చు, కెసియార్ తరహాలో బాబు తన యింటి నుంచే సెక్రటేరియట్‌ను నడపవచ్చు అని ఓదార్చుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయం మరో ఐదేళ్ల జగన్ పాలన అని గుర్తుంచుకుంటే దానికంటె యిదే బెటరని సమాధానపడవచ్చు. ఇలా చూస్తే కూటమి ఏర్పాటు మొత్తమంతా బాబు ఏ మేరకు సర్దుకుంటారు అనేదానిపై ఆధారపడి వుందని తేలుతుంది. కూటమి భాగస్వాములకు టిక్కెట్లివ్వాల్సి వస్తుంది కాబట్టి కొన్ని సీట్లలో త్యాగాలకు సిద్ధపడాలి అని తోటి నాయకులకు ఆయన పిలుపు నిచ్చారు. ఆ త్యాగమేదో ఆయన తనతోనే ప్రారంభించాలి!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)