చంద్రబాబునాయుడుకు ఇప్పుడు పార్టీలోని ముఠాల తలనొప్పి ఎదురవుతోంది. తెలుగుదేశం పార్టీ వాపును చూసి బలుపు అనుకోవడం కేవలం.. అధినాయకులు మాత్రమే కాదు.. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు కూడా అదే భ్రమల్లోనే ఉన్నారు. పైగా పవన్ కల్యాణ్ తమ పల్లకీ మోయడానికి రెడీ అవుతున్నాడనే సంగతి కూడా టీడీపీ వారికి కొత్త మూడ్ ఇస్తోంది.
ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీలో ముఠాలు తయారవుతున్నాయి. ఈ ముఠాకుమ్ములాటలను సర్దుబాటు చేయడం చంద్రబాబునాయుడుకు తలకు మించిన భారంగా తయారవుతోంది. ఆయన నిర్వహిస్తున్న పార్టీ సమీక్ష సమావేశాల్లో ప్రధానంగా ఈ అంశం గురించే ప్రస్తావిస్తున్నారు. పార్టీలో గ్రూపులు ఉంటే సహించేది లేదని అందరూ ఒక్కతాటి మీదకు రావాల్సిందేనని ఆయన హెచ్చరిస్తున్నారు.
అయితే చంద్రబాబునాయుడు ప్రధానంగా గుర్తించాల్సిన సంగతి ఒకటుంది. ఈసారి ఎన్నికలను ఎదుర్కొనే ముందు.. తెలుగుదేశం పార్టీ వారికి నియోజకవర్గాల్లో ఎదురయ్యే తలనొప్పి కేవలం రెండు మూడు ముఠాలు మాత్రమే కాదు. వాటికి ‘ప్లస్ వన్’ ముఠాలు ఉన్నట్లుగా లెక్కవేసుకోవాలి. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు ఈ దఫా జనసేనతో పొత్తు పెట్టుకోబోతున్నాడు.
జనసేన దళాలు కూడా.. తాము సొంతంగానే అధికారంలోకి వచ్చేయగలం అనే భ్రమల్లోనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, బలగం లేకపోయినా.. ముఠాలు కట్టి ఓట్లను చీల్చడానికి సరిపడా బలం వారికి ప్రతినియోజకవర్గంలోనూ ఉంది. వారితో పొత్తు పెట్టుకున్న తర్వాత.. టీడీపీ అభ్యర్థులకు చేటు చేయడానికి ఆ మాత్రం బలం చాలు. అందుకే చంద్రబాబునాయుడు తమ పార్టీలో అంతర్గతంగా ఉన్న ముఠాలు మాత్రమే కాదు. బయటినుంచి ఉన్న ముఠాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సొంత పార్టీ శ్రేణులు కార్యకర్తల మీద వీసమెత్తు అదుపులేని అత్యంత అసమర్థ నాయకుడిగా చంద్రబాబునాయుడికి గుర్తింపు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందరినీ దబాయిస్తూ రోజులు నెట్టవలసిందే తప్ప.. అధికారం లేనప్పుడు సొంత పార్టీలో కూడా ఆయనను లెక్కచేసేవారు లేరు. పార్టీ మీద ఆయనకు పట్టులేదు. ఎందుకంటే.. అది ఆయన తన సొంత రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీ కాదు.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం ద్వారా లాక్కున్నటువంటిది. అందువల్ల.. చంద్రబాబు పట్ల భయభక్తులు నటించే వారే తప్ప.. ఆయన తెలివితేటలు, నాయకత్వ సామర్థ్యాలను మనస్ఫూర్తిగా విశ్వసించే వారు లేరు. ఆ ఫలితమే తెలుగుదేశం పార్టీలో ముఠా తగాదాలు. చంద్రబాబు ఎన్ని హితవచనాలు చెప్పినా ఏ ముఠాలు కూడా వెనక్కు తగ్గకుండా చెలరేగిపోతుండడం కూడా.
పార్టీలో ఉన్న ముఠాలతోనే చంద్రబాబుకు తలబొప్పి కడుతున్న నేపథ్యంలో.. జనసేన పొత్తుల రూపంలో ఆయన మరింత కొరివితో తలగోక్కుంటున్నారు. ‘‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ గెలవలేం’’ అనే నినాదంతోనే ఈ రెండు పార్టీలూ ఒక్కటవుతున్నాయి. జగన్ ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం అనే సంగతి వీరికి క్లారిటీ ఉంది.
ఐక్యంగా పోరాడకపోతే.. మొదటికే మోసం అని అందరికీ తెలుసు.. అయినా సరే.. ఎవరి ఆశలు వారివి. అందుకే ముఠాలు కట్టి పార్టీని ముంచే పోకడలు తెలుగుదేశం పార్టీలో మితిమీరి కనిపిస్తున్నాయి. చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తున్నాయి.